అలా అయితే మేం పక్క రాష్ట్రాలకు పోతాం.. : నారా లోకేష్ !!

ఏపీ ప్రభుత్వం అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం పై టీడీపీ నేత నారా లోకేష్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన ఆయన రాష్ట్రంలో డైరీలు అభివృద్ధి చేస్తే నేరమా అని ప్రశ్నించారు.

ఎక్కడో గుజరాత్ నుంచి అమూల్ ను తెచ్చి నెత్తిన పెట్టుకోవడం ఏంటని విమర్శించారు. పాలు అన్నీ అమూల్ కే వెళితే పాలు అందక హెరిటేజ్ మూతపడుతుందన్న ప్రచారంపై నారా లోకేష్ స్పందించారు.

అమూల్ వచ్చినా తమకేం ఇబ్బంది లేదని.. ఇక్కడ పాలు సరిగా లేకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్లి హెరిటేజ్ పాలు సేకరిస్తుందని చెప్పారు. తమకు ఆ సామర్థ్యం ఉందని నారా లోకేష్ వివరించారు.

ప్రైవేట్ డైరీలు తమకు మాత్రమే కాదని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఉందని లోకేష్ చెప్పారు. శివశక్తి పేరుతో పెద్దిరెడ్డి కుటుంబానికి కూడా డైరీ ఉంది అని, అందరి కంటే తక్కువ ధర పాలకు చెల్లించే సంస్థ కూడా శివశక్తి డైరీనే అని చెప్పారు.

పెద్దిరెడ్డి కంపెనీ పాలు సేకరించే ప్రాంతంలో ఇతర డైరీలను అడుగుపెట్టనివ్వవరని, అందుకే అక్కడ తక్కువ ధరకే రైతులనుంచి పాలు సేకరిస్తున్నారని లోకేష్ వెల్లడించారు. లోకేష్ చెప్పిన దానిలో రెండు అంశాలను పరిగణలోనికి తీసుకుంటే.. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమూల్ తో చేసుకున్న ఒప్పందం సరైనది అని అనిపిస్తుంది.

ఇక్కడ పాలు అందకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్తామని లోకేష్ చెప్పడం బట్టి అమూల్ రాకతో రైతులకు ఎక్కువ ధర లభించబోతోందని పరోక్షంగా అంగీకరించినట్టుగా వుంది. తాము అధిక ధర చెల్లించలేం కాబట్టి పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడ తక్కువ ధరకు రైతుల నుంచి పాలు కొంటామని నారా లోకేష్ చెబుతున్నట్టుగా ఉంది.

రైతుల మీద ప్రేమతో కాదు హెరిటేజ్ ను దెబ్బతీయాలనే కుట్రతోనే జగన్మోహన్రెడ్డి అమూల్ ను తెస్తున్నారు అన్న చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు అని నారా లోకేషే అంగీకరిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కి చెందిన డైరీ కూడా తక్కువ ధరకు పాలు కొంటుందని నారా లోకేషే చెబుతున్నారు.

ఆ లెక్కన అమూల్ రాకతో పెద్దిరెడ్డి కుటుంబానికి కూడా నష్టం కలగవచ్చు. పలువురు వైసీపీ వాళ్ళకు కూడా డైరీలు ఉన్నాయి. అయినప్పటికీ అమూల్ తో ఒప్పందం చేసుకుంటున్నారు అంటే పోటీ పెరిగి రైతులకు అధిక ధర దక్కాలి అన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్న భావనకు నారా లోకేష్ వ్యాఖ్యలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి.

అమూల్ రాకతో ఏర్పడిన పోటీని తట్టుకునేందుకు హెరిటేజ్ సంస్థ ఇంతకాలం తనకు పాలు పోసిన రైతులకు అధిక ధర చెల్లిస్తుందో లేదా నారా లోకేష్ చెప్పినట్టుగానే పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రైతుల నుంచి తక్కువ ధరకు పాలు కొంటారో చూడాలి.

Leave a Comment