నందమూరి ఫ్యామిలీకి చోటులేదంటున్న చంద్రబాబు..

జాతీయ పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో పరిస్థితి చుస్తే చాలా ఘోరంగా వుంది. తెలంగాణాలో అయితే మరీ దారుణం. తెలంగాణలో ఆ పార్టీ దాదాపు దుకాణం సర్దేసినట్లే. ఆ పార్టీలో వున్న సీనియర్ నాయకులతో సహా పార్టీ క్యాడర్ మొత్తం ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయింది.

చివరకు ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ సైతం టీఆర్ఎస్‌లోకి వెళ్లడంతో ఆ పార్టీ పరిస్తితి దారుణంగా తయారైంది. ఇక్కడ పార్టీకి అధ్యక్షుడు లేని పరిస్థితి. అయినా సరే తెలంగాణలో ఇంకా టీడీపీ ఉందని చంద్రబాబు (Chandrababu Naidu) అంటున్నారు.

ఈ క్రమంలోనే కొత్త అధ్యక్షుడుని ఎన్నుకుని తెలంగాణాలో సైకిల్ చక్రం తిప్పాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్టు పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల పేర్లని అధ్యక్ష పదవికి పరిశీలించి, అందులోంచి ఒకర్ని అధ్యక్షుడిగా ఎంచుకునే పనిలో పడ్డారు. అయితే చంద్రబాబుకు మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి టీడీపీకి సేవ చేస్తున్న అరవింద్ గౌడ్‌కు అధ్యక్ష భాద్యతలు అప్పగించే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఎందుకంటే ఇప్పటికే పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వున్న అరవింద్ గౌడ్‌ బీసీ సామాజికవర్గానికి చెందినవాడు. ఆయనను అధ్యక్షుడుగా పెడితే బాగుంటుందని కొందరు టీడీపీ నాయకుల భావనగా చెప్తున్నారు. మరికొందరు సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరును సూచించిన.. అనారోగ్యం కారణంగా ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది.

నందమూరి ఫ్యామిలీలో ఎవరూ లేరా

ఇదంతా పక్కన పెడితే అసలు అధ్యక్ష పీఠం నందమూరి ఫ్యామిలీకే ఇవ్వాలని ఎప్పటినుంచో తెలంగాణా తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది. అలా అయితేనే పార్టీ బతికి బయటపడుతుందని పార్టీలోని కొంత క్యాడర్ భావిస్తోంది. కానీ తెలంగాణ తరపున నందమూరి ఫ్యామిలీలో నందమూరి సుహాసిని తప్ప ఎవరూ కనిపించడంలేదు. ఆమెకు ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఎలాంటి అనుభవం లేని నందమూరి సుహాసినికి ఈ అధ్యక్ష పీఠం దక్కే అవకాశమేలేదు. ఇటువంటి సందర్భంలో తెలంగాణ టీడీపీ బాధ్యతలు ఎవరికీ అప్పగిస్తారో అని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Leave a Comment