పోరంబోకు భూమిని నిర్మాణాలకు కేటాయించడం పర్యావరణ నిబంధనలకు విరుద్ధం.. ఎమ్మెల్యే ఆర్కె..

టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవన నిర్మాణ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది.

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో మూడు ఎకరాల 65 సెంట్లలో టిడిపి రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భూమి నీటి సాగుకు సంబంధించిన పోరంబోకు భూమి. దీనిని 2017 లో చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి కేటాయించింది. అక్కడే రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు.

వాగు భూమిని నిర్మాణాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే ఆర్కె తొలుత హైకోర్టును ఆశ్రయించారు. వాగు పోరంబోకు భూమిని నిర్మాణాలకు కేటాయించడం పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అయితే జూలై నెలలో హైకోర్టు ఎమ్మెల్యే ఆర్కే పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 2017 లో ఒకసారి ఈ అంశంపై పిటిషన్ వేస్తే కోర్టు తిరస్కరించిందని మరోసారి ఎందుకు పిటిషన్ వేశారని మండిపడింది. అసలు ఈ విషయంలో మీకు ఉన్న ఆసక్తి ఏంటి అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేను హైకోర్టు ప్రశ్నించింది.

ఏది ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ఏది రాజకీయ వ్యాజ్యమో తమకు తెలుసంటూ హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తరపు న్యాయవాది జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా ఈ పిటిషన్లో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. దాంతో ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

వాగు కు సంబంధించిన భూమిని నిర్మాణాలకు కేటాయించడం చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకమని దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఈ అంశంపై మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Leave a Comment