ఇకనుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు .. మార్చేసిన కేంద్రం

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ఆ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. రాజీవ్ ను తీసేసి, హాకీకి వన్నెతెచ్చిన క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరును చేర్చారు. ఇక నుంచి క్రీడల్లో అత్యున్నత అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా పిలుస్తారని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఖేల్ రత్నకు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టవలసిందిగా తనకు ఎప్పటినుంచో విజ్ఞప్తులు వస్తున్నాయని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. వారు వెల్లడించిన అభిప్రాయాలకు ధన్యవాదాలు చెప్పారు. ప్రజల సెంటిమెంట్ కు అనుగుణంగా ఖేల్ రత్నకు ధ్యాన్ చంద్ పేరును పెట్టమన్నారు.

దేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిన గొప్ప క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అని ఆయన కొనియాడారు. రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1992లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ప్రారంభించారు. అయితే ఇన్నాళ్లకు ఆ అవార్డుకు ధ్యాన్చంద్ పేరును పెట్టారు. మూడు వరుస ఒలంపిక్స్ లలో ధ్యాన్ చంద్ నేతృత్వంలోని హాకీ బృందం స్వర్ణ పతకాలను మనదేశానికి సాధించిపెట్టింది. ఆయన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతి రోజైన ఆగస్టు 29న క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. కాగా ఇది గొప్ప నిర్ణయమని, చరిత్రలో నిలిచిపోనున్నట్లుగా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Leave a Comment