నిమ్మగడ్డ ఒక్కరే సుప్రీం కాదు ..

వీడియో సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన నోటీసులకు మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. సాయంత్రం ఐదు గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించగా, అంతకంటే ముందే కొడాలి నాని తన వివరణ పంపారు.

తాను మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్ ను కించపరిచేలా మాట్లాడలేదని చెప్పారు. ప్రజలు అనుకుంటున్న విషయాలనే మీడియా సమావేశంలో మీడియా దృష్టికి తెచ్చామని కొడాలి నాని వివరించారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు మంత్రి కొడాలి నాని. తనకు ఈసీ అంటే గౌరవముందని, కాబట్టి తన వివరణ పరిగణనలోనికి తీసుకొని నోటీసును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడిన కొడాలి నాని ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషనర్ పూర్తిగా విఫలమయ్యారని చంద్రబాబునాయుడు నిన్న ఆరోపించారని, మరి చంద్రబాబు నాయుడుకు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని నిమ్మగడ్డను కొడాలి నాని ప్రశ్నించారు.

తన భాష పై మాట్లాడుతున్న వారు చంద్రబాబు వద్దకు వెళ్లి ముఖ్యమంత్రిని వాడు వీడు అని ఎందుకు అంటున్నారో ప్రశ్నించాలని సూచించారు కొడాలి నాని. తనను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారిని కట్టడి చేసినంత మాత్రాన వాస్తవాలు దాగవని వ్యాఖ్యానించారు.

నిమ్మగడ్డ ఒక్కరే రాజ్యాంగ వ్యవస్థ కాదని, తాము కూడా రాజ్యాంగ వ్యవస్థలోనే ఉన్నామని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక్కడే సుప్రీం కాదని ఆయన నోటీసును వెనక్కి తీసుకోకపోతే తమకు మార్గాలున్నాయని, కోర్టుకు వెళ్తామని వ్యాఖ్యానించారు.

Leave a Comment