ఇది వ్యక్తిగత గొడవా.. లేక పాలనలో భాగమా..!!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ పరస్పరం వాగ్వివాదానికి దిగడం ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు.

ఎందుకంటే ఏపీ గత ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా కేసీఆర్ కు తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఏపీలో అధికార మార్పిడి తర్వాత జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కేసీఆర్, జగన్ ల మధ్య సంబంధాలు కొనసాగాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ఆశీస్సులు అందించారు. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రులిద్దరూ హైదరాబాద్లో సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యల పై దృష్టి సారించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చర్చించుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడంతో తెలంగాణ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఒక రకమైన ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే గతంలో చంద్రబాబు, కేసీఆర్ మధ్య.. ఇప్పుడు కేసీఆర్, జగన్ ల మధ్య విభేదాలు లేదా ఘర్షణలకు చాలా తేడా ఉంది.

అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు..

కెసిఆర్, చంద్రబాబు మధ్య గొడవ వ్యక్తిగతమైనది. మరి కెసిఆర్, జగన్ మధ్య గొడవ రెండు ప్రభుత్వాల మధ్య హక్కులకు సంబంధించినది. ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు పాల్పడుతున్నారని, ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో నాటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికాడు అని కేసీఆర్ ఆరోపణ. ఆగ్రహానికి కారణం. అంతేకాదు సదరు ఎమ్మెల్యేకి 50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా రేవంత్ రెడ్డి పట్టడంతో పాటు, చంద్రబాబు briefed me అంటూ ఆడియో చిక్కడం తెలిసిందే.

దీంతో పదేళ్ల పాటు హైదరాబాద్ పై ఉన్న హక్కును వదులుకొను చంద్రబాబు రాత్రికి రాత్రి అన్నీ సర్దుకొని విజయవాడకు తరలి వచ్చిన వైనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే జగన్ విషయానికి వస్తే కేవలం నీటి పంపకాల్లో హక్కులకు సంబంధించి మాత్రమే కెసిఆర్ తో జగన్ కు విభేదాలు అంతేతప్ప, ఇద్దరి మధ్య గతంలో మాదిరిగా ప్రభుత్వాల కూల్చివేత వ్యవహారాలు గొడవకు కారణం కాలేదు. కేవలం ప్రభుత్వ అధినేతగా తమ తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం కౌన్సిల్ భేటీలో కెసిఆర్, జగన్ పరస్పర వాగ్వాదానికి తేడాని చూడొచ్చు.

వ్యక్తిగత స్నేహాలు ఇష్టాయిష్టాలు పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆమాత్రం కష్టపడడం ఆహ్వానించదగ్గ పరిణామమే. గతంలో చంద్రబాబు, ప్రభుత్వాల కూల్చివేతకు కుట్రలో భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని తలదించుకునేలా చేశారు. కానీ అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్తో గట్టిగా వాదించి జగన్ ఏపీని తలెత్తుకునేలా చేశారు. ఇది జగన్, చంద్రబాబు మధ్య ఉన్న తేడా. ఓటుకు నోటు కేసులో బాబు చట్టపరంగా తప్పించుకుంటున్నా.. ఇప్పటికే ప్రజాకోర్టులో తగిన శిక్షకు గురయ్యారు.

ఏదిఏమైనా ముఖ్యమంత్రులు, వాళ్ల స్నేహాలు ఏవి శాశ్వతం కావు. ప్రభుత్వాలు, పాలసీలు మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. ఆ స్పృహ, విజ్ఞత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉండటం వల్లే తమ తమ రాష్ట్ర జల ప్రయోజనాల కోసం బిగ్ ఫైట్ కు తలపడ్డారని అర్థం చేసుకోవచ్చు. అందుకే కేసీఆర్, జగన్ వాదనలు వ్యక్తులుగా కాకుండా ప్రభుత్వాలుగా ఉండటాన్ని గమనించవచ్చు.

Leave a Comment