ఢిల్లీలో కాంగ్రెస్ తో టిఆర్ఎస్ అలా.. మరి రేవంత్ ఇలా అంటాడేంటి.. !

ఢిల్లీలో కాంగ్రెస్ తో టిఆర్ఎస్ : వచ్చే యూపీ ఎన్నికలతో పాటు ఆపై జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. విందు రాజకీయాలతో పాలిటిక్స్ ని పరుగులు పెట్టిస్తోంది. కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ సోమవారం రాత్రి నిర్వహించిన విందులో పలు రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. ఇందులో తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కూడా పాల్గొనడం విశేషం. తెలంగాణ కేంద్రంగా టిఆర్ఎస్ vs కాంగ్రెస్ అన్నట్లుగా రాజకీయం వేడెక్కుతుంటే.. ఢిల్లీలో మాత్రం కలిసి పనిచేసేలా పరిణామాలు జరగడం విశేషం.

బీజేపీని ఓడించటం కోసం కలిసి వచ్చే పార్టీలతో కాంగ్రెస్ మంతనాలు ముమ్మరం చేస్తున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ విందు ఏర్పాటు చేశారు. 12 పార్టీలకు చెందిన నేతలు ఈ విందులో పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించడం.. అదేవిధంగా రానున్న యూపీ ఎన్నికల్లో బిజెపిని గెలవకుండా వ్యూహం ఖరారు చేయడమే ఇవి విందు ఉద్దేశం. ఇందులో కాంగ్రెస్ లో సంస్థాగత మార్పులు తేవాలని లేఖ రాసిన.. సంచలనానికి కారణమైన G3 నేతలలో దాదాపు అందరూ హాజరయ్యారు. వీరితో పాటుగా కాంగ్రెస్ ముఖ్య నేతలు, అదే విధంగా లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, సీతారాం ఏచూరి, రాజా, ఒమర్ అబ్దుల్లా, టిఆర్ఎస్ తో సహా ఆప్ పార్టీల నేతలు హాజరయ్యారు.

12 పార్టీలకు చెందిన నేతలు
లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, సీతారాం ఏచూరి, రాజా, ఒమర్ అబ్దుల్లా

కాంగ్రెస్ తో టిఆర్ఎస్ లెక్క సరిపోతుందా

తెలంగాణలో ప్రస్తుతం టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. గులాబీ నేతలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతల పైన అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఫైర్ అవుతూనే ఉన్నారు. అదే విధంగా ఈ రెండు పార్టీల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటివరకు గులాబీ పార్టీ నేతలు నాన్ కాంగ్రెస్, నాన్ బిజెపి అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చింది. సడన్ గా బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిన పార్టీలతో కలిసి విందుకు హాజరవడం కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. ఈ సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీలు బిజెపిని ఓడించడమే తమ ఉద్దేశం అనే విధంగా వ్యవహరిస్తున్నాయి.

2018 లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ పేరుతో కెసిఆర్ పలు ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారు. మమత బెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్ వంటి వారిని కలిశారు. కానీ ఆ తర్వాత ఆ ఆలోచనలు ముందుకు సాగలేదు. బిజెపి పూర్తి మెజారిటీతో రెండోసారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో కెసిఆర్ తిరిగి తెలంగాణ రాజకీయాలకే పరిమితం అయ్యారు.

రేవంత్ vs కేసీఆర్
రేవంత్ vs కేసీఆర్

ఇదే సమయంలో తెలంగాణా ఇచ్చి తమ రాజకీయంగా నష్టపోయామనే భావనలో ఉన్న కాంగ్రెస్, తిరిగి తెలంగాణలో బలపడాలని.. అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డికి పిసిసి బాధ్యతలు అప్పగించింది. రేవంత్ రెడ్డి సైతం తన సహజ ధోరణిలో కేసీఆర్ పైన విరుచుకు పడుతున్నారు. కాంగ్రెస్లో కొందరు నేతలు సహకరించకపోయినా కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ కేడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఇప్పుడు బిజెపిని ఓడించేందుకు వ్యతిరేక పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగాలని, బలోపేతం కావాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పాల్గొనడం ఇప్పుడు కీలకమైన చర్చగా మారింది. ప్రధాని మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలినుంచి సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీతో రాజకీయంగా పోరాడుతున్నా.. కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో మాత్రం తేడా రాకుండా చూసుకుంటున్నారు. అదేవిధంగా ప్రధాని సైతం అనేక సందర్భాల్లో కేసీఆర్ కు ప్రాధాన్యత ఇచ్చారు.

తెలంగాణ విభజన సమయంలో 2014లో రాష్ట్ర ప్రకటన చేస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పినట్టుగా ప్రచారం సాగింది. కాని దానికి విరుద్ధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ను పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయి. ఇక 2023 ఎన్నికల నాటికి కెసిఆర్ అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తవుతాయి. ఇప్పటికే అధికార పార్టీ పైన వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో గులాబీ పార్టీపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని రేవంత్ & కో ప్రయత్నాలు మొదలుపెట్టింది. బిజెపి సైతం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.

రేవంత్ పై ఆశలు పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్

అయితే జాతీయ స్థాయి రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చే కాంగ్రెస్.. బిజెపికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ – కాంగ్రెస్ కూటమిగా నిలిస్తే ఖచ్చితంగా తెలంగాణాలో దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు బీజేపీకి అవకాశం లభిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఉన్న సామాజిక సమీకరణాలతో బీజేపీతో గులాబీ పార్టీ కలిసే అవకాశాలు లేవు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పైన కొద్దికాలంగా టిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ఢిల్లీ కేంద్రంగా టిఆర్ఎస్ వేస్తున్న అడుగుల వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీని ద్వారా తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ ను బలహీనపరచడం అసలు ఉద్దేశంగా ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు వృథాగా మారతాయా అనే చర్చ కూడా మొదలయింది. మరి టిఆర్ఎస్ తో కాంగ్రెస్ కలిసి పనిచేసే పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిని రేపుతోంది.

Leave a Comment