Judge Uttam Anand | బెయిల్ ఇవ్వలేదని జడ్జినే మర్డర్ చేస్తారా

జార్ఖండ్ జడ్జి Uttam Anand హత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మొదట ఆయనది అనుమానస్పద మృతిగా, ఆపై రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక అసలు నిజం బయటపడింది. గుర్తుతెలియని వ్యక్తులు ఒక టెంపో వాహనంలో వచ్చి ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను ఢీ కొట్టి హత్య చేసినట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఈ హత్యతో దేశంలో న్యాయ వ్యవస్థ ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణకు విజ్ఞప్తి చేసింది. జార్ఖండ్లోని Dhanbad జిల్లా కోర్టులో Uttam Anand జడ్జిగా కొనసాగుతున్నారు. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన ఇంటికి అరకిలోమీటరు దూరంలో రోడ్డు పక్కన ఆయన పడిపోయి కనిపించారు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి రక్తమోడుతున్న Uttam Anand ను హాస్పిటల్ కి తరలించారు.

అయితే అప్పటికే ఆయన చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత కొద్ది గంటల పాటు ఆయన మృతదేహం హాస్పిటల్ లోనే ఉంది. అప్పటి వరకు ఆయన జడ్జి అనే విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఆనంద్ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద స్థితిలో మరణించిన వ్యక్తి మృతదేహం స్థానిక హాస్పిటల్ లో ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి పరిశీలించగా ఆ మృతదేహం Uttam Anand దే అని నిర్ధారించారు.

రోడ్డు ప్రమాదంలో మరణించి ఉంటాడేమో అన్న అనుమానంతో పట్టణంలోని సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. దీంతో Uttam Anand అనుమానాస్పద మృతి కాస్త హత్యగా తేలింది. జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ జరుగుతోందని.. ఒకవేళ ఆ విచారణ సంతృప్తికరంగా లేకపోతే కేసును సీబీఐకి బదిలీ చేస్తామని చెప్పారు.

హత్యకు గురైన Dhanbad కోర్టు జడ్జి ఉత్తమ్ ఆనంద్ ప్రస్తుతం చాలా మాఫియా కేసులపై విచారణ జరుపుతున్నారని తెలిసింది. ఇందులో భాగంగా ఇటీవల ఓ కేసులో ఇద్దరు గ్యాంగ్ స్టర్ లకు బెయిల్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో వారు ఉత్తమ్ ఆనంద్ ను హత్య చేయించి ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ్ ఆనంద్ ను ఢీ కొట్టిన ఆటో డ్రైవర్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఆయనతో పాటుగా మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురిని విచారిస్తున్న పోలీసులు, వారి నుంచి వివరాలు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు.

Leave a Comment