అయినా మమ్మల్ని పట్టించుకోరా.. ?

తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకీ పెరిగి పోతోంది. దేశం మొత్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉన్న ఆస్తులు అమ్ముకొని చదివిన చదువులకు ఉద్యోగాలు రాక చాలామంది ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు.

కానీ, ప్రభుత్వాలు మాత్రం నిరుద్యోగుల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా తమ పదవులను భర్తీ చేసుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికెషన్లు విడుదల చేయడం లేదు. పోనీ, ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీగా లేవా అంటే అదీకాదు , లక్షల కొద్ది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయి.

ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అక్షరాలా 1,48,666 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మొత్తం 32 శాఖల్లో కొత్తగా చేరిన పోస్టులతో పాటు కొందరు పదవీ విరమణ కావడంతో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంత స్థాయిలో ఉద్యోగాల్లో ఖాళీలు ఉన్నా ప్రభుత్వాలు మాత్రం ఈ ఖాళీలను నింపకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మొదటి స్థానంలో ఉన్న పోలీస్‌ శాఖలో మొత్తం 37,218 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న స్కూల్‌ ఎడ్యుకేషన్‌ శాఖలో 24,702 పోస్టులు,తరువాత ఉన్నత విద్యాశాఖలో 12,857, వైద్య, ఆరోగ్యశాఖలో 23,512, రెవెన్యూ శాఖలో 8,118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విచిత్రమేంటంటే కరోనా నేపధ్య కాలంలో వైద్య, ఆరోగ్యశాఖలో సిబ్బంది కొరతతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అయినా, ప్రభుత్వం ఈ పోస్టులను భర్తీ చేయలేదు. ( నగరానికి మరో మణిహారం .. )

కంటి తుడుపు చర్యగా కాంట్రాక్టు పద్ధతిలో కొంతమందితో నెట్టుకొచ్చారు. అంతేతప్ప పూర్తిస్థాయిలో ఉద్యోగులను తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేసి తమను ఆదుకోవాలని నిరుదోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Comment