నిమ్మగడ్డది అంతా వృధా ప్రయాసే.. జేసీ దివాకర్ రెడ్డి..

ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్లతో నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్ ను రద్దు చేసుకున్నారు. బుధవారం తనతో వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్ లు వచ్చేలా చూడాలంటూ నిన్న సీఎస్ నీలం సాహ్నీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.

అయితే సీఎస్ నీలం సాహ్నీ అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని, ప్రస్తుత పరిస్థితుల్లో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని తేల్చేశారు. సీఎస్ తీరుపై తొలుత నిమ్మగడ్డ అభ్యంతరం తెలిపారు.

రాజ్యాంగ సంస్థ అయినా ఈసీ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించేలా ప్రభుత్వ తీరు ఉంది అంటూ సీఎస్ కు ఎస్ఏంఎస్ పంపారు. ఆ తర్వాత గవర్నర్ ను కలిసి నిమ్మగడ్డ పరిస్థితిని వివరించారు. పదే పదే స్థానిక సంస్థలకు సంబంధించి గందరగోళం ఏర్పడుతున్న నేపథ్యంలో గవర్నర్ ను కలిసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు.

గవర్నర్తో భేటీ తర్వాత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం సహకరించడం లేదని, మరోసారి పైకోర్టుకు వెళ్లేందుకు నిమ్మగడ్డ సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్ని ఎత్తులు వేసినా ఎన్నికల నిర్వహణ మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

సిగ్గు శరం వదిలేసి నిమ్మగడ్డ తాను పదవిలో ఉండగానే ఎన్నికలు నిర్వహించి చంద్రబాబుకు తప్పుడు మార్గంలో కొన్నైనా స్థానిక సంస్థలలో సీట్లు దక్కేలా చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆదేశించగానే బయటకు వచ్చి ఎన్నికలు నిర్వహిస్తామంటే అది అయ్యే పని కాదని కొడాలి నాని తేల్చేశారు.

JC Diwakar newsmart9

అటు ఈసీ వివాదంపై టిడిపి నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ది అంతా వృధా ప్రయాస అని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఎన్నికలు జరుగుతాయని తాను భావించడం లేదన్నారు. ఎన్నికల నిర్వహణ ఈసీ ఒక్కటే చేయలేదని.. ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు జరిగే ఛాన్స్ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

జగన్ తాను అనుకున్నది చేసేందుకు ఎంతవరకైనా వెళ్తారని, కాబట్టి నిమ్మగడ్డది వృధా ప్రయాసే అని జేసీ తేల్చేశారు. నిమ్మగడ్డ ఏ నిర్ణయం తీసుకున్నా వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్తుందని, ఈ లోపు మార్చి 31 వచ్చేస్తుందని.. అప్పుడు ఈసీ పదవీకాలం కూడా ముగిసిపోతుందని జేసీ అభిప్రాయపడ్డారు.

ఏకగ్రీవాలను రద్దు చేస్తే ఎన్నికైన వారు కోర్టుకు వెళ్తారని.. రద్దు చేయకపోతే ఇతరులు కోర్టుకు వెళ్తారని.. ఎటు చూసినా ఇది సుప్రీం కోర్టు వరకు వ్యవహారం వెళుతుందని.. ఆ లోపు నిమ్మగడ్డ పదవీకాలం ముగిసి పోతుందని జె.సి.దివాకర్రెడ్డి విశ్లేషించారు. ప్రభుత్వ సహకారం లేకుండా నిమ్మగడ్డ ఏమీ చేయలేరు అని జేసీ వ్యాఖ్యానించారు.

Leave a Comment