వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కొన్నేళ్లుగా అక్రమాస్తులపై సిబిఐ కేసు విచారణ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో భాగంగా వైయస్ జగన్ కొన్నాళ్లు జైలు జీవితం కూడా అనుభవించారు. ఈ క్రమంలోనే జగన్ కు సిబిఐ కోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. దీనిని ఆసరాగా చేసుకుని ప్రత్యర్థి పార్టీలు, పచ్చ మీడియా నిత్యం జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇదంతా రాజకీయ కక్షలో భాగంగా జగన్ మోహన్ రెడ్డిపై పెట్టిన కేసులుగా ఆయన తరపు న్యాయవాదులు ఛాలెంజ్ గా తీసుకుని కోర్టులో బలంగా వాదనలు వినిపిస్తున్నారు. జగన్ పై ఉన్నవి తప్పుడు ఆరోపణలుగా సాక్ష్యాధారాలతో నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక కూడా ఈ కేసు సిబిఐ కోర్టులో పలుమార్లు విచారణ జరిగి వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు పై విచారణ జరిగింది. రాజకీయ నాయకులపై పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు గతంలో చెప్పిన నేపథ్యంలో జగన్ ఆస్తుల కేసు విచారణ వేగవంతం అయింది. దీనిలో భాగంగా నేడు పెన్నా సిమెంట్స్ కేసుపై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెన్నా సిమెంట్స్ పెట్టుబడులు పెట్టడాన్ని తప్పుబడుతూ సిబిఐ తన చార్జిషీట్లో పేర్కొంది. ఇదే కేసులో జగన్ ను A1 గా చేర్చింది. దీనిని సవాల్ చేస్తూ సీఎం జగన్ సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే నాపై తప్పుడు కేసులు బనాయించారని.. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని .. దీనికి సంబంధించి చాల మంది సాక్షులను విచారించారని.. ఎవరూ కూడా తనకు వ్యతిరేకంగా చెప్పలేదని పిటిషన్ లో పేర్కొన్నాడు. అందుకే పెన్నా సిమెంట్స్ కేసు చార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని సీఎం జగన్ సిబిఐ కోర్టును అభ్యర్థించారు.
సిబిఐ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దాని ఆధారంగా కోర్టు ఈ నెల 22న విచారణ చేయనుంది. ఇదే కేసులో విచారణ ఎదుర్కొంటున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజగోపాల్, సామ్యూల్ కూడా తమ పేర్లను తొలగించాలంటూ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఇండియా సిమెంట్ కేసు విచారణ ఈనెల 23న సీబీఐ విచారణ చేపట్టనుంది. గత కొంత కాలంగా స్తబ్దుగా కొనసాగుతున్న జగన్ కేసులు ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తుది తీర్పు సీఎం జగన్ కు అనుకూలంగా ఉంటుందని ఆయన తరపు న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసు చివరి దశకు చేరడంతో రాజకీయంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.