సొంత పార్టీ ఎమ్మెల్యేలు జగన్ పై గుస్సాగా ఉన్నారా.. ఆయన పై కారాలు మిరియాలు నూరుతున్నారా.. పైకి చెప్పలేక లోలోన కుమిలిపోతున్నారా.. అంటే అవుననే అంటున్నారు వైసిపి నాయకులు. మేము ఇంత డమ్మీ అయిపోతానని కలలో కూడా అనుకోలేదు అని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డుగా ఇటీవల మీడియా ముందు వ్యాఖ్యానిస్తున్నారు. వారి మాటల్లోనే వారి అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఎమ్మెల్యేలు అంటున్న ఈ తాజా వ్యాఖ్యలు జగన్ వరకు చేరాయని సమాచారం.
మరి దీనికి కారణం ఏంటి..? చాలా మంది ఎమ్మెల్యేలు మేము డమ్మీలం అనే అంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది..? అంటే రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఒకటి జగన్ తీసుకొచ్చిన సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ. గత ఏడాది అక్టోబర్ 2న ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ వ్యవస్థను అంతే ప్రతిష్టాత్మకంగా ముందుకు నడిపిస్తున్నారు జగన్.
అయితే ఈ వ్యవస్థలు ప్రభుత్వానికి.. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నా, పరోక్షంగా ఎమ్మెల్యేలను.. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను డమ్మీ చేసిందనేది విమర్శ. ప్రజలకు ఏది కావాలన్నా గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకునేవారు.
దీంతో ఎమ్మెల్యేలు ఆయా పనులు చేసిపెట్టే ప్రజల్లో సానుభూతి, గౌరవం సంపాదించుకుని తదుపరి ఎన్నికల్లో వాడుకునేవారు. అయితే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వచ్చాక అన్ని వాలంటీర్లే చూస్తున్నారు. దీంతో ప్రజలు ఎవరూ కూడా ఎమ్మెల్యేలను పెద్దగా ఖాతరు చేయడం లేదు.
ఉదాహరణకు టిడిపి ప్రభుత్వంలో చిన్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లేదా ఎవరికైనా పెన్షన్ వచ్చినా స్వయంగా ఎమ్మెల్యేలు చెక్కులిచ్చి నానా హంగామాతో పబ్లిసిటి చేసుకునేవారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు లబ్ధిదారులుగా వున్నా.. వారిని స్వయంగా నాటి టిడిపి ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్ కి పిలిపించుకునేవారు. ఇప్పుడు అవేవీ లేకపోవడం వైసీపీ ఎమ్మెల్యే లకు నచ్చడం లేదు.
అదే సమయంలో ప్రభుత్వం కూడా ఆన్లైన్ లోకి అందుబాటులోకి రావడం, టోల్ఫ్రీ నెంబర్లను ఇవ్వడం వంటి పరిణామాలతో ప్రజలకు.. తమకు ఉండే సంబంధాలు చాలా వరకు తగ్గిపోతాయని వారి ఆవేదన. ఈ నేపథ్యంలో ఇటీవల జగన్ ఈ వ్యవస్థను తీసుకువచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా చప్పట్లతో వాలంటీర్లను అభినందించాలని పిలుపు ఇచ్చినా.. ఎమ్మెల్యేలు ఎవరు కూడా స్పందించలేదు. దీనిపై ఇంటెలిజెన్స్ కూడా జగన్ కు సమాచారం ఇచ్చిందని అంటున్నారు.
ఇతర పార్టీ నేతల వలసలు
ఇలా ఎమ్మెల్యేలు ఎందుకు గుస్సాగా ఉన్నారో జగన్ తేల్చేందుకు సిద్ధపడుతున్నారు అని అంటున్నారు. ఇక మరో కీలక కారణం అవసరం లేకపోయినా జగన్ ఇతర పార్టీ నేతలను పార్టీలోకి చేర్చుకోవడం.. వారి పెత్తనం ఎక్కువ కావడం. పార్టీ అధిష్టానం నుంచి కూడా ఎలాంటి నియంత్రణ ఆదేశాలు లేకుండా పోవడంతో నాయకులు తీవ్ర స్థాయిలో తర్జన భర్జన పడుతున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే తమకు కష్టమని, ఎవరికో ఒకరికి పగ్గాలు అప్పగించాలని.. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమిడే పరిస్థితి లేదని అంటారు. ఇక ఇతర పార్టీల నేతలను పార్టీలోకి తీసుకునే విషయంలో ఎమ్మెల్యేలకు నచ్చకపోయినా, ఎంపీలు చేర్చుకుంటున్నారు. ఇది కూడా గ్రూపులకు మరింత ఆజ్యం పోసేలా ఉంటున్నాయి. మొత్తానికి ఈ రెండు పరిణామాలు వైసిపి లో హాట్ టాపిక్ గా మారదానికి కారణం. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.