సోము వీర్రాజు సైలెంట్ అయ్యారా.. కారణం ఇదేనా..!!

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఒక రకంగా చెప్పాలంటే ఏపీ కమలం పార్టీకి ఉన్న ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు. బిజెపి రాష్ట్ర పగ్గాలు చేపట్టాలనేది ఆయన చిరకాల వాంఛ. ఎప్పుడో ఎన్నికలకు ముందే తనకు ఈ పదవి దక్కుతుందని ఆయన భావించారు.. అయితే ఇప్పటికి కానీ అది ఫలించలేదు.

ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అణువణువునా నింపుకొన్న సోమూ .. ఎట్టకేలకు బీజేపీ పగ్గాలు చేపట్టారు. అయితే ఆయన అత్యంత తక్కువ సమయంలోనే కేంద్ర బిజెపి పెద్దల వ్యూహంకి వ్యతిరేకంగా వెళ్తున్నారనే భావన వ్యక్తమవుతోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో సోము అధికారాలకు కత్తెర పడిందని పరిశీలకులు.

రాష్ట్రం ఏదైనా.. ఎక్కడైనా జాతీయ పార్టీల వ్యూహాలు ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా ఉండాలనేది బిజెపి వ్యూహం. ఏపీ విషయానికొస్తే ఈ వ్యూహం ఎక్కడో బెడిసికొడుతోంది. ఇక్కడ కీలకమైన కమ్మ సామాజిక వర్గాన్ని కలుపుకొని వెళ్లడంలో సోము వీర్రాజు విఫలమవుతున్నారని అంటున్నారు. ఇక రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చి తీరుతామని, కాపు నాయకుడే సీఎం అవుతారని కూడా ఆయన చెబుతూ వచ్చారు.

అదే సమయంలో ప్రధానంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సిన సోమూ.. ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. నిజానికి గతంలో జనసేనాని పవన్ ఇలానే చేశారు. అధికారంలో ఉన్న చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్ను విమర్శించే వారు. ఇప్పుడు బిజెపి లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని కొన్నాళ్లుగా విమర్శలు వచ్చాయి.

ఇక పార్టీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకున్న సోము దీనిలోనూ కమ్మ సామాజిక వర్గానికి ఎక్కడ చోటు దక్కనివ్వకపోవడం గమనార్హం. ఈ నేపధ్యంలో ఈ విషయంపై దృష్టి పెట్టిన కేంద్రంలోని బిజెపి నాయకులు.. రాష్ట్రంలో ఎన్టీఆర్ కుమార్తె కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి ఊహించని పదవి ఇచ్చారు. నిజానికి సోము వీర్రాజు దాదాపు ఆమెను పక్కన పెట్టారని వార్తలు వచ్చిన తరుణంలో కేంద్రం ఇలా వ్యవహరించడం సంచలనమే. అంతేకాదు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాల నుంచి కూడా పురంధేశ్వరికి పిలుపు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

సామాజిక కూర్పు, కమ్మ వర్గాన్ని పార్టీకి చేరువ చేయడం వంటి కీలక బాధ్యతలు ఆమెకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తే సోము వీర్రాజు స్పీడ్ కు ఎక్కడో బ్రేకులు పడ్డట్టే అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకూ ఆయన ఓ రేంజులో విమర్శలు గుప్పించినా.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.. సైలెంట్ అయిపోయారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితి బిజెపి లో చర్చనీయాంశంగా మారింది అనటంలో సందేహం లేదు.

Leave a Comment