చిరంజీవికి రాజ్యసభ ..! ప్రచారంలో నిజమెంత.. ?

చిరంజీవికి వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా బిజెపి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అసలు ముందుగా చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటు ఇస్తుందా..! ఇచ్చినా వారికి ప్రయోజనం ఉంటుందా..!

కాపు ఓటర్లకు గాలం వేస్తారా

చిరంజీవికి రాజ్యసభ ఇస్తే కాపు సామాజిక వర్గం దగ్గరవుతుందని జగన్ భావిస్తున్నారు అన్నది ఈ ప్రచారం చేస్తున్న వారి వాదన. కానీ చిరంజీవి రాజ్యసభ ఇచ్చి ఒక వర్గం ఓట్లకు గాలం వేయాలన్న పరోక్ష పద్ధతి మీద జగన్ ఆధారపడే వ్యక్తా అనేది కూడా చూడాలి. ఒకరిని అడ్డుపెట్టుకొని ఓటర్లను ఆకర్షించాలనే ఆలోచన ఇప్పటి వరకు జగన్ లో కనిపించలేదు. పైగా చిరంజీవికి రాజ్యసభ ఇస్తే కాపులంతా వచ్చేస్తారు అని ఏ పార్టీ అనుకున్నా అది అమాయకత్వమే అవుతుంది.

చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆయన ప్రస్తుతం బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. పవన్ కు కేంద్ర మంత్రి పదవి దక్కడం కూడా అంత ఈజీ కాదు. పవన్ కు నరేంద్ర మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పవన్ తన బలాన్ని చూపలేకపోయారు.

తిరుపతిలో పవన్ బలం ఏంటో తెలిసిపోయింది

జనసేన బలం బిజెపి తలరాతను మార్చేస్తుంది అనుకుంటే తిరుపతిలో బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదు. దానికితోడు వచ్చే ఏడాది అనేక రాష్ట్రాల్లో ఉన్న రాజ్యసభ స్థానాలు కూడా బీజేపీ కోల్పోతోంది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలోనికి ఎందుకు తీసుకుంటారు అన్నది చూడాలి.

పైగా ఏపీలో బీజేపీకి ప్రత్యేకమైన లక్ష్యాలు ఏమీ లేవు. ఏపీ కోటాలో మంత్రి పదవి ఇస్తే తెలంగాణలో పవన్ ఉపయోగపడతారు అన్నది కొందరు ప్రచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ను బిజెపి నేతలు ఎంత తేలిగ్గా తీసుకున్నారో అందరూ చూశారు.

ఇక్కడ చిరంజీవికి మరో ఇబ్బంది కూడా వుంది. ఏ ప్రాంతీయ పార్టీ లోనైనా అందరూ అధినాయకత్వం చెప్పినట్లే నడుచుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పార్టీ నిర్ణయాలు నచ్చకపోయినా నాయకత్వం చెప్పినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి పని చేసేందుకు సిద్ధపడతారా అన్నది అనుమానమే. ఆయన ఒక ప్రాంతీయ పార్టీలో సర్దుకుపోవడం అంత సులువు కాదు అన్న అభిప్రాయం కూడా ఉంది.

చిరంజీవి లాంటి వారిని పార్టీలోకి తీసుకుంటే వారి గౌరవ మర్యాదలు పై నిరంతరం అందరి దృష్టి ఉంటుంది. చర్చ జరుగుతూ ఉంటుంది. అది కూడా పార్టీలకు ఒక సమస్యగా మారే అవకాశం ఉంది. పార్టీ స్థాపించిన అప్పటినుంచి ఉన్న వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వారికి వరుసగా ఎమ్మెల్సీ పదవులు జగన్ ఇస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఇప్పటికి ఇప్పుడు చిరంజీవి రాజ్యసభ ఇవ్వాల్సిన అవసరం వైసీపీ గాని.. పవన్ కళ్యాణ్ రాజ్యసభ ఎంపిక చేసి కేంద్ర మంత్రిని చేయాల్సిన అవసరం బీజేపీకి గానీ వుందా అన్నది పెద్ద అనుమానమే.

Leave a Comment