కాంగ్రెస్ పార్టీని వీడనున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… ప్రచారంలో నిజమెంత..?

దివంగత నేత వైఎస్ఆర్ మరణంతోనే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని చెప్పాలి. వైయస్సార్ రెండుసార్లు సీఎం అయినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ మరణం తర్వాత దేశంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఏపీలో వైఎస్సార్ తనయుడు జగన్ కారణంగా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయింది. అక్కడ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో పడిపోయింది. ఇక తెలంగాణలో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితం అయింది.

చిచ్చు రేపిన పీసీసీ పదవి

తాజాగా పీసీసీ పదవి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపినట్లుగానే కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న కాంగ్రెస్ నాయకులను కాదని టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి పిసిసి పదవి ఇవ్వడంపై పార్టీలోని సీనియర్ నాయకులు గుర్రుగా వున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడం పై కొందరు పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్న వారిని కాదని నిన్నమొన్న వచ్చిన నాయకులకు ఎలా పదవులిస్తారని హై కమాండ్ ను ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నాయకులైతే పార్టీని వీడటానికి కూడా రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇలా పార్టీ మారే వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

పిసిసి పదవిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పైగా ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ .. తిరిగి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అయినప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి పీసీసీ పదవి దక్కక పోవడంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారని తెలుస్తోంది. ఆయన పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారని సమాచారం. ( టీఆర్ఎస్ పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ )

వైయస్సార్ అభిమానిగా

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మొదటి నుంచి కూడా వైయస్సార్ అభిమానిగానే ఉండేవారు. ఆయన ఇచ్చిన అండతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేకమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా వెనుకబడి పోయారు. ఒకానొక సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ జగన్ వెంట నడుస్తానని ప్రచారం కూడా జరిగింది. అయితే జగన్ సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకోవడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా యూటర్న్ తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది.

తాజాగా రేవంత్ రెడ్డికి పిసిసి పగ్గాలు ఇవ్వడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడాలని చూస్తున్నారట. వైయస్సార్ తనయురాలు అయన వైఎస్ షర్మిల తెలంగాణలో అతి త్వరలో పెట్టబోతున్న కొత్త పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. వైయస్ఆర్ జయంతి రోజున అంటే జూలై 8న షర్మిల తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. అదే రోజున కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పార్టీలో చేరుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే షర్మిల పార్టీకి పెద్ద అండ దొరికినట్లు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారా లేదా అన్నది మరి కొద్దీ రోజులు వేచి చూడాలి.

Leave a Comment