దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్ ల సందడి షురూ..!

క్రికెట్‌ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మధురక్షణాలు రానే వచ్చాయి. కరోనా దెబ్బకు వాయిదా పడిన ఐపీఎల్‌ మళ్లీ జరగబోతోందన్న విషయం వారిలో అమితానందాన్ని కలగజేస్తోంది.

IMG 20200907 WA0004

ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఈ నెల 19నుంచి ప్రారంభమవుతాయని షెడ్యూల్‌ రావడంతో క్రికెట్‌ సందడి మొదలైంది. ఈ క్రీడలో కీలకమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 21న బెంగళూరుతో ఆడనుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌లో ప్రారంభం కానుంది.
ఇక దేశవ్యాప్తంగా ఐపీఎల్‌ సందడి చేయనుంది. ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఐపీఎల్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. గత టోర్నీ విజేత–రన్నరప్‌లు తొలి మ్యాచ్‌లో ఢీకొనే సంప్రదాయం కొనసాగనుంది. ఈ నెల 19న (శనివారం) జరిగే ఐపీఎల్‌ ఆరంభం పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌–చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ యూఏఈ రాజధాని అబుదాబిలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30కి మ్యాచ్‌ మొదలవుతుంది.

IMG 20200907 WA0002
IMG 20200907 WA0001

ఇక 21న దుబాయ్‌లో (బెంగళూరుతో) జరిగే మ్యాచ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన పోరును ఆరంభించనుంది. టోర్నమెంట్‌లో మొత్తం 10 డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో తొలి పోరు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30కి, రెండో పోటీ రాత్రి 7.30కి మొదలవుతాయి. లీగ్‌ మ్యాచ్‌ల పూర్తి వివరాలను ప్రకటించిన బీసీసీఐ..ప్లే ఆఫ్స్, ఫైనల్‌ పోరుతోపాటు, మహిళల టీ20 లీగ్‌ తేదీలు, అవి ఎక్కడ నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. టైటిల్‌ ఫైట్‌ నవంబరు 10న జరగనుంది.

సుదీర్ఘంగా 53 రోజులపాటు సాగే ఈ ఐపీఎల్‌లో 56 లీగ్‌ మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌లతో కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక లీగ్‌ చరిత్రలో ఇది సుదీర్ఘ టోర్నీగా రికార్డు సృష్టించనుంది. వాస్తవానికి ఈ షెడ్యూల్‌ను గతవారమే విడుదల చేయాల్సి ఉంది. కానీ అబుదాబి, షార్జా, దుబాయ్‌లలో స్వీయ నిర్బంధ నిబంధనలు వేర్వేరుగా ఉండడం, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో ఇద్దరు క్రికెటర్లు సహా 13 మంది కొవిడ్‌ బారిన పడడంతో ప్రకటన ఆలస్యమైంది. ఇక..అదనంగా ఆరు రోజుల స్వీయ నిర్బంధంతో అన్ని జట్లకంటే చివరగా చెన్నై సాధన ప్రారంభించడంతో టోర్నీ మొదటి మ్యాచ్‌కు ఆ జట్టు సిద్ధంగా ఉంటుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ షెడ్యూల్‌ విడుదలతో ఆ అనుమానాలు పటాపంచలయ్యాయి.

Leave a Comment