ఇందిరాగాంధీ తరహాలో వైస్ జగన్ ..!!

ప్రజలకు న్యాయం చేయడం కోసం, వాళ్ళకు సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంలో భాగంగా ఎంత దూరమైనా వెళ్తానని గత ఎన్నికల ప్రచారంలో జగన్ చెబితే చాలా మందికి అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ఏకంగా న్యాయవ్యవస్థతోనే ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం అవడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రతిపక్షనేత చంద్రబాబుకే కాదు మొత్తం ఆంధ్ర ప్రజానీకానికి ఆశ్చర్యం కలిగించే విషయం. ఎన్ని వ్యవస్థల్లో ఎన్ని అవకతవకలు జరిగినా.. అన్నీ అంతిమంగా న్యాయవ్యవస్థ వద్దకు రావాల్సిందే. న్యాయవ్యవస్థను ప్రశ్నించాలని, ఎదురు చెప్పాలని ఎవరూ కలలో కూడా అనుకోరు. ఎందుకంటే కోర్టు ధిక్కారం అనేది ఒకటి ఉంది అక్కడ. అలా సర్వహక్కులు.. తిరుగులేని అధికారాలు కలిగి ఉన్న న్యాయస్థానంతో ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు యుద్ధానికి దిగారు.

అదేదో పరోక్షంగా రాజకీయంగా చేసే యుద్ధం కాదు.. ప్రత్యక్ష యుద్ధం. న్యాయ వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను తప్పుబట్టే సందర్భాలు దేశ చరిత్రలో ఉన్నాయి. కాకపోతే ఇలా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏకంగా సుప్రీం కోర్టు జడ్జి పైన.. ఇంత మంది హైకోర్టు లాయర్ ల పైన ఓపెన్ ఫైట్ చేయడం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పాలి. గతంలో ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ తీవ్రస్థాయిలో న్యాయవ్యవస్థను ప్రశ్నించారు. ఆ తర్వాత మళ్లీ ఆ సంచలనం రేపిన వ్యక్తి ఏపీ సీఎం జగన్ మాత్రమే.

ఒకప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1967లో తొలిసారిగా న్యాయవ్యవస్థకు బహిరంగ సవాల్ చేశారు. వ్యతిరేకంగా గళం వినిపించారు. రాజ్యాంగాన్ని సవరించాలని.. కొన్ని ప్రాథమిక హక్కులలో మార్పులు చేయాలని సవాల్ చేశారు. అప్పట్లో చీఫ్ జస్టిస్ గా పనిచేసిన కోటా సుబ్బారావు ఈ సవాలును స్వీకరించారు. రాజ్యాంగంలో మార్పులు చేయడం కుదరదని తీర్పునిచ్చారు. అప్పటి ఆ తీర్పు ఇందిరాగాంధీకి ఆగ్రహం తెప్పించింది. ఆ ఘటనతో కోటా సుబ్బారావును ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి బరిలో నిలిపాయి ప్రతిపక్షాలు.

ఆ సంగతి పక్కన పెడితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ప్రధాన మంత్రికి మధ్య జరిగిన మొట్టమొదటి ఓఎన్ వార్ గా చరిత్రకెక్కింది. ఆ తర్వాత ప్రైవేట్ బ్యాంకుల జాతీయకరణ, రాచరిక అధిపతుల బిరుదుల రద్దు వంటి అంశాలపై కూడా సుప్రీం కోర్టుతో విభేదించారు ఇందిరా. ఇప్పుడు జగన్ ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది. ఇందిర జమానాలో జరిగిన ఆ ఘటన తర్వాత ప్రజాస్వామ్య, న్యాయ వ్యవస్థల మధ్య ఆ స్థాయిలో బహిరంగ యుద్ధాలు మళ్ళీ జరగలేదు.

ఎంతోమంది పాలకులు న్యాయ వ్యవస్థలో కలిసిపోయారు.. న్యాయ వ్యవస్థకు చెందిన వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. దశాబ్దాలుగా సహృద్భావ వాతావరణంలో కొనసాగుతున్న ఈ అనుబంధాన్ని చంద్రబాబు విషతుల్యం చేశారు. స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం మొదలుపెట్టారు. కొంత మంది న్యాయవాదులు వ్యవస్థను కాపాడటం మానేసి, వ్యక్తులను కాపాడటం మొదలు పెట్టారు. సరిగ్గా ఇదే జగన్ను న్యాయవ్యవస్థపై ప్రత్యక్ష పోరాటానికి దిగేలా చేసింది.

ఏపీ హై కోర్టు వ్యవహారాల్లో సుప్రీం కోర్టు జడ్జి తలదూర్చడం.. ఏకంగా ఐదుగురు హైకోర్టు జడ్జిల పరిశీలనలు, వాదనల్ని జగన్ తప్పుబట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. తన ఆరోపణలతో పాటు ఆధారాలను జత చేస్తూ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్ లేఖ రాయడం దేశ వ్యాప్తంగా పెను సంచలనానికి దారి తీసింది.

కేవలం ఫిర్యాదు చేసి ఊరుకోలేదు జగన్.. ఏపీలో తమ ప్రభుత్వాన్ని కూల్చేలా లేదా అస్థిరపరిచేలా హైకోర్టు వ్యాఖ్యానాలు.. తీర్పులు ఉన్నాయని ఆయన బహిరంగంగా ఆరోపించారు. అక్కడితో ఆగలేదు తను ఆరోపణలు చేసిన సుప్రీం కోర్టు జడ్జి ఎన్.వి.రమణ ఆస్తుల జాబితాను కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించారు. చంద్రబాబుకు , రమణకు మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా తన లేఖలో ప్రస్తావించారు. న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసే హక్కు ముఖ్యమంత్రికి ఉందా అంటే చట్టం ప్రకారం న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసే సర్వహక్కులూ ముఖ్యమంత్రికి ఉన్నాయి.

నిజానికి ఇక్కడ ముఖ్యమంత్రి అనే పదవి అసలు అడ్డు కాదు. ఓ సామాన్య వ్యక్తి కూడా తనపై వచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా పై కోర్టుకు వెళ్లవచ్చు. ఇప్పుడు జగన్ చేసింది కూడా దాదాపు అదే. మొత్తం మీద ఈ వ్యవహారంతో తన వైఖరి ఏమిటో.. ప్రజా సంక్షేమం పట్ల తనకు ఎంత నిబద్ధతతో ఉన్నాడో జగన్ మరోసారి చెప్పకనే చెప్పినట్లయింది.

Leave a Comment