అమెరికాకు మరింత చేరువగా భారత్ ..

ఇండియా ఓ విషయంలో అమెరికాకు చేరువలో ఉంది. చేరువలో ఉండడం కాదు.. పరిస్థితి ఇలాగే ఉంటే అమెరికాను కూడా త్వరలోనే దాటేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ ఏ విషయం గురించి చెబుతున్నారు అనుకుంటున్నారు కదా.. అదేనండి కరోనా కేసుల విషయంలో. ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరిగి పోతున్నాయి.

కరోనా విజృంభణలో ఇప్పటి వరకు అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. ఇండియా రెండోస్థానంలో కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య కొంత నెమ్మదిస్తున్నా ఇండియాలో మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. ప్రతిరోజూ అమెరికా కేసుల సంఖ్య కంటే రెండింతల కేసులు ఇండియాలో నమోదవుతున్నాయి.

శుక్రవారం నాటికి కేసుల సంఖ్యలో అమెరికా కంటే ఇండియా కేవలం 9లక్షల కేసులతోనే వెనకబడి ఉంది. నెల రోజుల క్రితం అమెరికా కేసులకంటే సగానికి తక్కువ ఉన్న సంఖ్య యమా స్పీడుగా పెరిగి అమెరికాను దాటేసే బాటలో పయనిస్తోంది. శుక్రవారం నాటికి అమెరికాలో 78లక్షల 57వేల కేసులు నమోదైతే, ఇండియాలో 69లక్షల ఆరువేల కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ అమెరికా కంటే డబుల్‌ స్థాయిలో ఇండియాలో కేసుల సంఖ్య పెరగడంతోనే ఇప్పుడు అమెరికా కేసులకు చేరువయ్యాం.

అయితే, శుక్రవారం మాత్రం అమెరికాలో పోలిస్తే కాసింత ఊరటనిచ్చేలా ఇండియాలో కేసుల సంఖ్య తగ్గింది. అయితే, అది కూడా అమెరికా కంటే ఎక్కువే. కాకుంటే అమెరికా కంటే 7వేల కేసులు మాత్రమే అధికం. శుక్రవారం అమెరికాలో 63,783 కేసులు నమోదైతే.. ఇండియాలో 70,496 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల విషయానికొస్తే శుక్రవారం అమెరికాలో 928 మంది మృత్యువాత పడగా.. ఇండియాలో 964మంది ప్రాణాలొదిలారు.

మొత్తం ఇప్పటి వరకు ఇండియాలో లక్షా ఆరువేల 490మంది ప్రాణాలు పోగొట్టుకుంటే.. అమెరికాలో మాత్రం రెండు లక్షల 18వేల 91మంది మృత్యువాత పడ్డారు. మొత్తానికి ఇదే పరిస్థితి కొనసాగితే మరి కొన్ని రోజుల్లోనే ఇండియా అమెరికాను దాటేసి కరోనా కేసుల విషయంలో ప్రపంచంలోనే మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంటుందన్న ఆందోళన భారత ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Leave a Comment