LOC వెంబడి ఎలాంటి కాల్పులు జరగలేదు : ఇండియన్ ఆర్మీ..!!

గత కొద్ది రోజులుగా భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ రెచ్చగొట్టే చర్యలు చేస్తున్నారు. భారత సైనిక పోస్ట్లు, సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నారు.

మరోవైపు ఉగ్రవాదుల సైతం భారత్ లోకి చొరబడేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ 13న పలు సెంటర్లలో భారత్-పాకిస్థాన్ల మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. పాక్ రేంజర్ల కాల్పుల్లో పలువురు జవాన్లు, పౌరులు మరణించడంతో భారత సైన్యం ఎదురుదాడి చేసింది.

రాకెట్లు, మిస్సైల్స్ ను ఎక్కుపెట్టి పాకిస్తాన్ బ్యాంకర్లను పేల్చేసింది. ఈ దాడిలో పదుల సంఖ్యలో పాకిస్థాన్ సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే చైనా ప్రోద్భలంతో సరిహద్దుల్లో పాకిస్తాన్ మళ్ళీ చెలరేగి పోతుందన్న నేపథ్యంలో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసిందని పలు మీడియా ఛానెల్స్ లో వార్తలు వచ్చాయి.

POK లోకి భారత సైనిక బృందాలు దూసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తాయని పేర్కొన్నాయి. టెర్రర్ లాంచ్ ప్యాడ్ లను ధ్వంసం చేస్తాయని కథనాలు ప్రసారం చేశాయి. దీనిని సర్జికల్ స్ట్రైక్ 2 గా పేర్కొంటూ ట్విట్టర్లో నెటిజన్లు సైతం ట్విట్ల మోత మోగించారు.

ఇండియన్ ఆర్మీ, సర్జికల్ స్ట్రైక్ 2 పేర్లను ట్రెండింగ్ లోకి తీసుకు వచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో భారత ఆర్మీ స్పందించింది. గురువారం LOC వెంబడి ఎలాంటి కాల్పులు జరగలేదని స్పష్టం చేసింది. ఈ ప్రచారంపై PIB facts check టీం కూడా స్పందించింది.

ఇది ఫేక్ న్యూస్ అని, ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదని ప్రజలకు సూచించింది. సరిహద్దు వెంబడి ఇలాంటి కాల్పులు జరగలేదని తెలిపింది. మరోవైపు నిన్న జమ్మూ కాశ్మీర్ లో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి.

జమ్మూ నుంచి శ్రీనగర్ కి వెళ్తున్న ఉగ్ర మూకలను మట్టుబెట్టాయి. గురువారం ఉదయం జమ్మూ , శ్రీనగర్ హైవేపై టోల్ ప్లాజా వద్ద భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Leave a Comment