హైదరాబాద్‌ గోల్ఫ్‌ కోర్సుకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం..

Srinivasa goud

హైదరాబాద్‌ గోల్ఫ్‌ కోర్సుకు అంతర్జాతీయ ఖ్యాతీ తెచ్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.
గోల్ఫ్‌ కోర్స్‌ విస్తరణ, అభివృద్ధి తదితర విషయాలను పరిశీలించేందుకు సోమవారం ఆయన గోల్కొండ కోట సమీపంలోని హైదరాబాద్‌ గోల్ఫ్‌ కోర్సును సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన పర్యాటకశాఖ ఉన్నతాధికారులు, హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ ప్రతనిధులతో కలిసి గోల్ఫ్‌ కోర్సులో పర్యటించారు.
గోల్కొండ నయాఖిలాలో భారతీయ పురాతత్వ సర్వేక్షణ ఆధీనంలో గల 30 ఎకరాల స్థలాన్ని ఆయన పరిశీలించారు.

అనంతరం ఆయన గోల్ఫ్‌ క్లబ్‌ హాల్‌లో మాట్లాడుతూ..గోల్ఫ్‌ క్లబ్‌ ఏర్పాటుకు 213 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ వారికి లీజుకు మాత్రమే ఇచ్చిందని, అయితే గోల్ఫ్‌ కోర్స్‌ వారు ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వం పేరు రాయడం కానీ, వారి ప్రెజెంటేషన్‌లలో ప్రస్తావించడం చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు గోల్ఫ్‌ కోర్సు ప్రతినిధులు ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వానికి కానీ, తెలంగాణ పర్యాటక శాఖకు గానీ టోర్నమెంట్, వార్షిక నివేదికలు ఎందుకు పంపలేదని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ స్థలంగా గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. హైదరాబాద్‌ గోల్ఫ్‌ కోర్సులో అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్‌ టోర్నమెంట్‌ నిర్వహించాలని, దీనికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మంత్రి వెంట రాష్ట్ర పర్యాటకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్, యువజన టూరిజం కల్చర్‌ కార్యదర్శి శ్రీనివాసరాజు, టూరిజంశాఖ ఎండీ మనోహర్‌ తదితరులున్నారు.

Leave a Comment