తెలంగాణలో కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కేటీఆర్ అనే టిఆర్ఎస్ లో ఎక్కువగా వినపడుతుంది. ఈమేరకు పార్టీలో అడ్డులేకుండా కేసీఆర్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు కూడా. అసలు 2018 ఎన్నికల్లో గెలిచిన మొదట్లోనే కేటీఆర్ ను సీఎం చేస్తారన్న వార్తలు బాగానే చక్కర్లు కొట్టాయి. కానీ అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దీని తర్వాతనే కేటీఆర్ పట్టాభిషేకం ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి.
కెసిఆర్ రెండో విడత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికే మూడేళ్లు పూర్తయ్యాయి. ఇంకా రెండేళ్ల పదవీకాలం మాత్రమే వుంది. కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా పార్టీ నాయకులు భావిస్తున్నారు. చివరి ఏడాదికి సీఎం చేస్తే ఎన్నికల హడావిడి కారణంగా ఎక్కువగా ఫోకస్ చేయలేక ఏదైనా తేడా కొడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే సాధ్యమైనంత త్వరగా కేటీఆర్ ను సీఎం చేయాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
హుజురాబాద్ లో కేటీఆర్ ప్లాన్ ఏంటి
కానీ హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ తన సత్తా చాటితే.. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేటీఆర్ ను కెసిఆర్ సీఎం చేయలేకపోవచ్చేమో అన్న వార్తలూ వినిపిస్తున్నాయి. అందుకే హుజురాబాద్ లో విజయం కోసం కేసీఆర్ పార్టీ బలగం మొత్తాన్ని రంగంలోకి దించింది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరిస్తున్నారు.
అయితే హుజురాబాద్ ఈటెలకు బలమైన కోట కావడం వల్ల ఫలితాలు ఎలా ఉంటుందన్నది అప్పుడే చెప్పే పరిస్థితి లేదు. దీనికితోడు హుజురాబాద్ లో త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మూడు బరిలో ఉండడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ గనుక ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే అది టీఆర్ఎస్ కే అనుకూలంగా మారుతుంది. మొత్తానికి కేటీఆర్ పట్టాభిషేకం అంశం హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం పై ఆధారపడి ఉందనే చెప్పాలి.
Nice post