అసెంబ్లీ రద్దు చేయాలంటున్న టీడీపీ.. మరి ముందస్తు ఎన్నికలకు రెడీనా..!

వైసీపీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే టిడిపి నేతలు అసెంబ్లీ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసురుతున్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. వందకి వంద శాతం వైసీపీనే మరోసారి అధికారంలోకి రావడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ( నారా లోకేష్ వ్యవహార శైలే టీడీపీ ఈ పరిస్థితికి కారణమా.? )

2019 ఎన్నికల్లో మొదలైన వైసిపి వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి ఎన్నిక జరిగిన వార్ వన్ సైడ్ అన్నట్లుగా వైసీపీ జెండా ఎగురుతోంది. జగన్మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఏదో ఒక సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతూ ఉంది. ఈ ప్రభావం ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు.. ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో కనిపించింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఈ ఎన్నికల్లో వైసీపీకి కనీస పోటీ ఇవ్వలేకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

మొన్న జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టిడిపి ప్రకటించింది. అయితే టిడిపి తరఫున పలువురు అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించారు. కానీ టిడిపి మాత్రం తాము బహిష్కరించిన ఎన్నికల్లో గెలవడం ఒక గెలుపైనా అంటూ విమర్శలు గుప్పిస్తోంది. అంతకు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి కనీస పోటీ కూడా ఇవ్వలేదు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తు పైనే జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో టిడిపి ఒక తాడిపత్రిలో మినహా ఎక్కడా వైసీపీకి పోటీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే టిడిపి ముందస్తు ఓటమి భయంతోనే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలను బహిష్కరించిందని వైసిపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

అసెంబ్లీ రద్దు చేయాలంటూ కొత్త డ్రామా

ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే నిజంగా జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే.. టిడిపి నుంచి ఎంత మంది నేతలు సిద్ధంగా ఉన్నారు అనేది మాత్రం అనుమానంగా మారింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ముందస్తుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ను త్వరలోనే రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ( కేసీఆర్ తరహాలో జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దపడుతున్నాడా.. ? )

మరోవైపు రెండేళ్లుగా సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు జగన్ మోహన్ రెడ్డి. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ఏపీలో బలంగా వినిపించింది. టీడీపీ మాత్రం గత రెండేళ్లలో ఏ ఎన్నికల్లో వైసీపీకి గట్టిపోటీ ఇచ్చిన దాఖలాలు లేవు. మరోవైపు పొత్తు లేకుండా చంద్రబాబు హయాంలో టీడీపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన చరిత్ర లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు అటు జనసేన, ఇటు బీజేపీ సుముఖత వ్యక్తం చేయడం లేదు.

టిడిపికి చెందిన పారిశ్రామికవేత్తలు అమరావతి రాజధాని కారణంగా, కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే డబ్బులు ఖర్చు చేసేందుకు వారంతా సిద్ధంగా లేరని టాక్. అంతేకాకుండా టిడిపిలో కొద్దిరోజులుగా కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళితే నష్టపోయేది టిడిపి అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

3 thoughts on “అసెంబ్లీ రద్దు చేయాలంటున్న టీడీపీ.. మరి ముందస్తు ఎన్నికలకు రెడీనా..!”

Leave a Comment