స్కూల్స్ రీఓపెన్ పై భిన్నాభిప్రాయాలు. తెరవాలా..వద్దా ..!

స్కూల్స్ రీఓపెన్ పై భిన్నాభిప్రాయాలు : కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్ డౌన్ తదితర పరిస్థితుల కారణంగా అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు మూతపడ్డాయి. తాజాగా పరిస్థితి కొంత అదుపులోకి రావడంతో విద్యాసంస్థలను తెరిచేందుకు, ప్రత్యక్ష బోధన నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినందున నిరభ్యంతరంగా పాఠశాలలు, కాలేజీలు తెలుసుకోవచ్చని విద్యాశాఖకు సూచించింది. కరోనా 3rd వేవ్ ఇప్పట్లో వచ్చే సూచనలు కూడా లేవని స్పష్టం చేసింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్కూల్స్ రీఓపెన్ చేయాలని సూచన చేసింది. ( డిజిటల్ విద్యాబోధన )

స్కూల్స్ రీఓపెన్ .. ఎంతవరకు సాధ్యం

సినిమా హాళ్లకు అనుమతి ఇచ్చినప్పుడు విద్యాసంస్థలకు ఇస్తే తప్పేంటని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రాజకీయ నేతల యాత్రలు, భారీ సభలు, సమావేశాలు కొనసాగుతున్నాయని.. వాటికి లేని నిబంధనలు స్కూళ్లకు వర్తింప చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఏడాదిన్నరగా స్కూళ్ళు , కాలేజీలకు వెళ్ళక పోవడం వల్ల విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ప్రమోషన్ విధానం నష్టం చేకూర్చుతుంది. ఇది విద్యార్థుల భవితవ్యాన్ని దెబ్బతీస్తోంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని స్కూళ్లు, కాలేజీలు తెరవాలని సూచించినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

స్కూల్స్ రీఓపెన్ పై వైద్య ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై విద్యాశాఖ వర్గాలు తర్జనభర్జన పడుతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఈనెల 15 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించాయి. పాఠశాలలు తెరవడమే మంచిదని పలువురు విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొందరు తల్లిదండ్రులు కూడా పాఠశాలను కొన్ని జాగ్రత్తలు నడుమ తెరవడమే మంచిదంటున్నారు. దూరదర్శన్, టీశాట్ పద్ధతుల్లో ఆన్లైన్ తరగతుల వల్ల విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదన్న విమర్శలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

ప్రైవేట్ పాఠశాలలలో వర్చువల్ పద్ధతుల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని.. అయితే వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని అంటున్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లను దశలవారీ పద్ధతిలో ఇప్పటికే పునః ప్రారంభించారు. మరికొన్ని రాష్ట్రాలు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణలో కూడా స్కూల్స్ రీఓపెన్ పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఈనెల 1న జరిగిన మంత్రి మండలి సమావేశానికి ముందు రోజు తాము నివేదికను సమర్పించామని.. కానీ ఆ విషయం క్యాబినెట్ లో చర్చించలేదని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

ఆగస్టు 15 తర్వాత స్కూళ్ళు దశలవారీగా మొదలు పెట్టాలని తాము సూచించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజు విడిచి రోజు కరోనా నిబంధనతో స్కూల్స్ రీఓపెన్ చేసేలా ఇటీవల పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. దీనికి తగ్గట్టుగా కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో స్కూళ్లు తెరవడం లేదు. ఏపీలో ఈనెల 16 నుంచి పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను ప్రారంభించనున్నారు. తమిళనాడులో సెప్టెంబర్ 1 నుంచి మొదలు పెట్టనున్నారు. తెలంగాణలో కూడా త్వరలో స్కూల్స్ రీఓపెన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా ఏపీలో స్కూళ్ళు తెరవకుండా ఆదేశాలివ్వండంటూ కోర్టులో పిటిషన్ వేశారు కొందరు పిల్లల తల్లిదండ్రులు. ఒకవేళ కరోనా మూడో వేవ్ విజృంభిస్తే అది పిల్లలపై ప్రభావం చూపితే పరిస్థితి ఏంటనే అభిప్రాయాన్ని కొందరు పిల్లల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కు ముందు ఇలానే స్కూళ్ళు తెరిచి ఫీజులు కట్టించుకొని కరోనా విజృంభణతో మళ్ళీ స్కూళ్ళు మూసేసారు. అందుకే మరోసారి అలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

1 thought on “స్కూల్స్ రీఓపెన్ పై భిన్నాభిప్రాయాలు. తెరవాలా..వద్దా ..!”

Leave a Comment