ఏందీ.. నాకీ తలనొప్పి..

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ సీటు కేటాయింపు విషయంలో కేసీఆర్‌కు కార్యకర్తలు కొరకరాని కొయ్యగా మారారన్న ప్రచారం సాగుతోంది. సీఎం కేసీఆర్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. కెసిఆర్ మాట ఎప్పుడూ కాదనని కార్యకర్తలు ఇప్పుడు ససేమిరా అంటున్నారట. దీంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారట గులాబీ అధిపతి.

ఇప్పుడు అక్కడ టికెట్‌ ఎవరికి ఇవ్వాలో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎవరికి ఇస్తే ఏం జరుగుతుందోనన్న ఆందోళన తెరాస పార్టీలో నెలకొంది. ఇప్పుడు జరగనున్న ఉపఎన్నిక దుబ్బాక అసెంబ్లీ స్థానం తెరాస ఖాతా లోనిదే. ఇటీవల అనారోగ్యంతో అక్కడి ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నాయకుడు రామలింగారెడ్డి మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరగనుంది.

కానీ , ఈ ఎన్నికల్లో సీటు కోసం రామలింగారెడ్డి కుమారుడు సతీష్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆయనకే టికెట్‌ ఇవ్వాలని రామలింగారెడ్డి కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. అయితే, సీఎం మాత్రం టికెట్‌ను సతీష్‌రెడ్డికి కాకుండా రామలింగారెడ్డి భార్యకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే, టీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం వారి కుటుంబం నుంచి కాకుండా వేరే ఎవరికి ఇచ్చినా విజయం కోసం కృషి చేస్తామని, రామలింగారెడ్డి కుటుంబంలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా సహకరించేది లేదని అధిష్టానానికి ఖరాఖండిగా చెప్పారట.

ఈ వ్యతిరేకించే వర్గం నేతలంతా రాష్ట్ర మంత్రి హరీష్‌రావుకు దగ్గరివారు కావడంతో వారిని బుజ్జగించే పనిని కేసీఆర్‌ హరీష్‌రావుకు అప్పగించారు. అలాగే ఉప ఎన్నికల బాధ్యతలను కూడా హరీష్ రావుకు అప్పగించారు. అయితే హరీష్‌రావు వారితో మాట్లాడినా ఎవరూ వినిపించుకోవడం లేదని సమాచారం.

పైగా గత ఎన్నికల్లోనే మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి కూడా దుబ్బాక అసెంబ్లీ టికెట్‌ కోసం చాలా ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే రామలింగారెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నందున టికెట్‌ ఆయనకే ఖరారైంది. అందుకు ఆయన విజయం కూడా సాధించారు. కానీ, ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ టికెట్‌ కోసం శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ టికెట్‌ తనకే ఇవ్వాలని కేసీఆర్‌ను కోరుతున్నారట. అయితే, ఈ సారి కూడా ఆయనకు టికెట్‌ వచ్చే పరిస్థితి లేదని గ్రహించి, రామలింగారెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంన్న పార్టీ నాయకుల సహకారంతో శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఈ విషయంలో హరీష్ రావు కలగజేసుకుని శ్రీనివాసరెడ్డికి ఎమ్ఎల్సి ఇస్తామన్న తన మాట కూడా వినడం లేదట. ఈ విధంగా టీఆర్‌ఎస్‌లో అసమ్మతి పెరుగుతుండడంతో ఇప్పుడు దుబ్బాక టికెట్‌ను ఎవరికి ఇవ్వాలో తెలియక కేసీఆర్‌ ఇబ్బంది పడుతున్నట్టు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

దీనికితోడు కాంగ్రెస్, బీజేపీలు కూడా విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో ఏంజరుగుతుందో అన్న ఆందోళన కార్యకర్తలలో కూడా వుంది. మొత్తానికి కేసీఆర్‌కు కూడా ఇప్పుడు టికెట్‌ కేటాయింపు విషయంలో తలనొప్పి తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment