భారత్ లో బైక్‌ అమ్మకాలు వుండవు ..Harley Davidson‌

అమెరికన్‌ కంపెనీ అయిన హార్లే డేవిడ్సన్‌ ప్రీమియం బైక్‌ల విభాగంలో మంచి వాటాను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో భారత్‌లోకి అడుగు పెట్టింది ఈ సంస్థ. కానీ దీని అంచనాలు తలకిందులయ్యాయి. నష్టాల కారణంగా ప్రస్తుత వ్యాపార నమూనా నుంచి వైదొలగాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హర్యానాలోని బావల్‌లో ఉన్న తయారీ కేంద్రాన్ని మూసివేయనుంది. హార్లే డేవిడ్సన్‌ కంపెనీకి అమెరికా బయట ఉన్న ఏకైక తయారీ కేంద్రం ఇది కావడం గమనార్హం.

అదే విధంగా గురుగ్రామ్‌లో ఉన్న విక్రయాల కార్యాలయం పరిమాణాన్ని కూడా తగ్గించనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. భారత్‌లోని తన కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు, భవిష్యత్తులో ఉత్పత్తి పరంగా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చింది. ప్రస్తుత కాంట్రాక్టు కాలం వరకు డీలర్ల నెట్‌వర్క్‌ కొనసాగుతుందని కంపెనీ తెలియజేసింది. అంటే అప్పటి వరకు కంపెనీ వాహన విక్రయాలు కొనసాగనున్నాయి. ప్రస్తుత వ్యాపార విధానాన్ని మార్చుకోవడంతోపాటు.. భారత్‌లోని కస్టమర్లకు ఇక ముందూ సేవలు అందించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు హార్లే డేవిడ్సన్‌ చెప్పుకొచ్చింది. అయితే, భారత్‌లో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే భాగస్వామి కోసం హార్లే డేవిడ్సన్‌ చూస్తున్నట్టు తెలుస్తుంది. హార్లే డేవిడ్సన్‌ ఇండియాలో 2009 ఆగస్ట్‌ నుంచి తన కార్యకలాపాలు మొదలు పెట్టింది.

‘2020 చివరి నాటికి అమలు చేయాలనుకున్న ‘రీవైర్‌’ ప్రణాళికలో భాగమే ఈ చర్యలు. అదే విధంగా హార్లే డేవిడ్సన్‌ బ్రాండ్‌, ఉత్పత్తుల ఆదరణ కోసం 2021-25 కాలానికి రూపొందించిన ‘హార్డ్‌వైర్‌’కు మారడంలో భాగమే’’ అంటూ హార్లే డేవిడ్సన్‌ తన ప్రకటనలో వివరించింది. రీవైర్‌ కింద అంతర్జాతీయంగా డీలర్ల నెట్‌వర్క్‌ను మరింత అనుకూలంగా మార్చుకోవడంతోపాటు కొన్ని అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వైదొలగడం, భారత్‌లో విక్రయాలు, తయారీ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ కమీషన్‌కు కూడా కంపెనీ సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్‌ 23 నాటికి ఆమోదించిన ఈ చర్యలను వచ్చే 12 నెలల కాలంలో అమలు చేయనున్నట్టు స్పష్టం చేసింది.

భారత్‌పై ఒత్తిడి తెస్తున్న అమెరికా

భారత్‌ హార్లే డేవిడ్సన్‌ బైకులపై భారీ పన్నులు వడ్డిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నో సార్లు నిరసన తెలిపారు. పన్నులు తగ్గించకపోతే తాము కూడా అదే విధమైన చర్యను తీసుకోవాల్సి వస్తుందంటూ పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారు. దాంతో అప్పటి వరకు 100 శాతంగా ఉన్న పన్నును భారత్‌ సగానికి తగ్గించినా ట్రంప్‌ శాంతించలేదు. భారత వాహనాలపై అమెరికాలో సున్నా పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేస్తూ మరింత తగ్గించాలని పలుమార్లు డిమాండ్‌ కూడా చేశారు.

Leave a Comment