దిగొస్తున్న బంగారం ధరలు..

రెండు రోజులుగా బంగారం ధరలు చూస్తే తగ్గుముఖం పడుతున్నాయి. ఎంసిఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 2.6 శాతం లేదా రూ .1,400 తగ్గి రూ.50,550లకు చేరుకుంది. వెండి విషయానికొస్తే, సిల్వర్ ఫ్యూచర్స్ 4 శాతం లేదా కిలోకు రూ.2,700 తగ్గి రూ.64,257లకు చేరుకుంది.

గత సెషన్‌లో బంగారం ధరలు 6 శాతం అంటే 10 గ్రాములకు రూ.3,200 తగ్గగా, వెండి 12 శాతం, అంటే కిలోకు రూ.9,000 పడిపోయాయి. ఈ విధంగా బంగారం కేవలం రెండు రోజుల్లో రూ.4,500, వెండి 11,700 రూపాయలు తగ్గాయి. గత వారం దేశంలో బంగారం ధర రూ.56,000కు పెరిగింది. వెండి దాదాపు రూ.78,000 స్థాయికి చేరుకుంది.

వెండి ధర భారీగా పతనం

దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్లో బంగారం ధర మంగళవారంతో పోలిస్తే రూ.1,643 తగ్గింది. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం స్పాట్ ధర 10 గ్రాములకు రూ.1643 తగ్గి రూ .52,308 కు చేరుకుంది. మరోవైపు వెండి స్పాట్ ధర కిలో రూ.7,761 తగ్గి రూ.63,450 లకు చేరుకుంది.

వ్యాక్సీన్ ప్రకటనే కారణమా ..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రపంచంలోనే తొలి కోవిడ్19 వ్యాక్సీన్‌ను ప్రకటించడంతో గ్లోబల్ రిస్క్ భయాలు తగ్గుతున్నాయి. రష్యా కరోనా వ్యాక్సీన్ వార్తను ప్రకటించిన తర్వాత కొందరు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేపట్టారని, అందుకే విలువైన లోహాల ధరలు పతనమవుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో సెంట్రల్ బ్యాంకులు, ప్రభుత్వాలు భారీగా ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించగా, సురక్షితమైన ఆస్తిగా బంగారాన్ని భావించారు.

Leave a Comment