‘గంటా’ మోగడానికి సిద్ధమేనా..

విశాఖ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సిటీలోని నాలుగు స్థానాలను గత ఎన్నికల్లో టీడీపీనే గెలుపొందింది. దీంతో వైజాగ్ పై పట్టు సాధించేందుకు వైసీపీ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా టీడీపీ నేత విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీలో చేరబోతున్నారని కొద్ది నెలల క్రితం ప్రచారం జరిగింది. గంట అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు అని చెప్పడం తప్ప ఇప్పటి వరకూ ఆయన వైసిపి తీర్థం పుచ్చుకోలేదు.

ఈ గ్యాప్ లో విశాఖ టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రం వైసీపీకి జై కొట్టారు. ఇక ఇప్పుడు తాజాగా మరో సారి గంట వైసీపీలోకి రాబోతున్నారు అంటూ ప్రచారం మొదలైంది. అయితే అన్ని రకాల ప్రచారాలకు ఇక ఫుల్ స్టాప్ పడినట్టేనా.. కాదా అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.

ముహూర్తం ఖరారు అయినట్టేనా

గంటా శ్రీనివాసరావు అక్టోబర్ 3న అమరావతిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరుతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. తన కుమారుడు రవితేజతో కలిసి గంటా శ్రీనివాసరావు అమరావతి వెళ్లనున్నారు. రవితేజకు జగన్ చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పనున్నారు. ఈరోజు ముహూర్తం ఖరారు అయినట్లేనని వైసిపి వర్గాలు కూడా చెబుతున్నాయి.

అక్టోబర్ 3వ తేదీన అమరావతి రావాలంటూ విశాఖ నార్త్ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి KK రాజుకు పెద్ద పార్టీల నుంచి పిలుపు వెళ్ళింది. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నందునే స్థానిక నేతలను పిలిచి ఒకసారి మాట్లాడడానికి పార్టీ పెద్దలు KK రాజును పిలిచినట్టు చర్చ జరుగుతోంది.

ఇటీవల ఏపీలో 25 లోక్ సభ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షులు ప్రకటించింది టిడిపి. వారిని ఎంపిక చేసేందుకు నిర్వహించిన సమావేశంలో గంటా శ్రీనివాసరావు గారు లేరు. అలాగే సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇటీవల టిడిపిని వీడి వై.సి.పి.లో చేరారు. ఆయన ప్రత్యక్షంగా పార్టీ కండువా కప్పుకో పోయినా, గణేష్ కుమారులకు సీఎం వైఎస్ జగన్ వైసీపీ కండువా కప్పారు. దీనిపై చర్చించేందుకు నిర్వహించిన టీడీపీ సమావేశంలో కూడా గంటా శ్రీనివాసరావు కనిపించలేదు.

కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు కూడా గంటా దూరంగా ఉంటున్నారు. అయితే గంట శ్రీనివాస వైసీపీలో చేరికను మంత్రి అవంతి శ్రీనివాసరావు బలంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గంటా వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగినప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కేసుల నుంచి బయటపడేందుకే ఆయన వైసీపీలోకి చేరుతున్నారు అన్నట్లుగా మాట్లాడారు.

వాస్తవానికి వ్యాపారవేత్తగా ఉన్న అవంతి శ్రీనివాస్ రావు, గంటా శ్రీనివాసరావు ప్రోద్బలంతోనే ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత అవంతి టిడిపిలో ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. గంటను చేర్చుకోమని స్పష్టంగా చెబితేనే తాను వైసీపీలో చేరతానని అవంతి జగన్ దగ్గర స్పష్టమైన హామీ తీసుకున్నారని ప్రచారం కూడా ఉంది.

అందుకే వ్యతిరేకిస్తున్నారా

గంటా శ్రీనివాసరావు చేరిక విజయసాయిరెడ్డి వర్గం వారు వ్యతిరేకిస్తున్నారు. గంట మీద భూ ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో అప్పటి అధికార టిడిపి మీద వైసీపీ చేసిన విమర్శల్లో అది కూడా ఒకటి. టిడిపి హయాంలోనే విశాఖ భూముల ఆక్రమణ మీద సిట్ ఏర్పాటైంది. జగన్ ప్రభుత్వం వచ్చాక విశాఖలో భూ ఆక్రమణ మీద విచారణ కొనసాగుతుందని సిట్ స్పష్టం చేసింది. ఇక విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను గంటా శ్రీనివాసరావు సమర్ధించారు.

విశాఖలో ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనేది వైసిపి వ్యూహంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో విశాఖ నగరంలో టిడిపి నాలుగు అసెంబ్లీ సీట్లు గెలిచింది. అందులో ఒకరు వాసుపల్లి గణేష్ కుమార్ ఇప్పటికే వైసీపీలో చేరారు.

ఇక మిగిలిన ముగ్గురూ కూడా వైసీపీలోకి తీసుకొస్తే టీడీపీ ఖాళీ అవుతుందని వైసిపి ప్లాన్. అందుకే గంటాను కూడా వైసీపీ లోకి తీసుకొచ్చేందుకు జగన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. టిడిపిని ఖాళీ చేస్తే వచ్చే గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో జివిఎంసి మీద వైసీపీ జెండా ఎగరడం సాధ్యం అవుతుందనే అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉంది. ఇక రానున్న రోజుల్లో విశాఖ రాజకీయాలు ఏ విధంగా మారుతాయో చూడాలి.

Leave a Comment