వారిపై కోపం.. వీరికి శాపం!

తెలంగాణ రాష్ట్ర పాలకుల పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే, కోపం ఒకరిపై – ప్రతాపం మరొకరిపై అన్నట్టు వుంది. ఉద్యోగుల అవినీతిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దీనికి దీనికి అద్దం పట్టేలా వుంది. ఉన్నత స్థాయి ఉద్యోగులు చేస్తున్న అవినీతిని అరికట్టలేక చిరుద్యోగులపై తమ ప్రతాపాన్ని చూపారన్న విమర్శలు వినబడుతున్నాయి. ( నూతన రెవిన్యూ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం.)

రెవెన్యూ వ్యవస్థలో అవినీతి బాగా పెరిగిపోయిందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే దీనిని అరికట్టడం కోసమంటూ రెవెన్యూ చట్టం ద్వారా ప్రక్షాళన మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వీఆర్‌ఏల వ్యవస్థను తొలగించింది. వారి వద్ద ఉన్న అన్ని రికార్డులను కూడా తహసీల్దార్‌లకు అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ ప్రక్రియ కూడా పూర్తయింది.

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అన్నీ తహసీల్దార్లే చేపడతారని, దీనివల్ల ఆ శాఖలో అవినీతి లేకుండా చేస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. కానీ, ఇక్కడ గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే, రెవెన్యూ శాఖలో భారీగా అవినీతి ఉందన్న విషయాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే.

ఇలాంటి కేసులు ఏసీబీ అధికారులకు ఇటీవల చాలా దొరకుతున్నాయి. వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయల్లో లంచాలు తీసుకుంటున్న ఘటనలు పడటం మనం చూసాము. అయితే, ఈ కేసుల్లో దొరికింది వీఆర్‌ఓలు కాదు, ఏకంగా ఆర్డీఓ,తహసీల్దార్ మరియు డిప్యూటీ కలెక్టర్ల స్థాయివారే. ఇంకా ఈ కేసుల్లో కొంతమంది కలెక్టర్లు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

ఇటువంటి తరుణంలో చిరు ఉద్యోగులైన వీఆర్‌ఓలను అవినీతి పేరుతో తొలగించి భారీగా అవినీతికి పాల్పడుతున్న ఉన్నత ఉద్యోగుల పక్షాన నిలబడింది ఈ ప్రభుత్వం. ఈ వ్యవహారం ప్రభుత్వంపై విపక్షాలు సైతం విమర్శలకు దిగుతున్నాయి. భారీగా అవినీతికి పాల్పడుతున్న అధికారులకే మళ్లీ రెవెన్యూ పగ్గాలు అప్పగించడం వల్ల అవినీతిని ఎలా అరికడతారో అర్ధం కావడం లేదని మేథావులు కూడా ఆలోచనలో పడ్డారు.

ప్రభుత్వంలోని పాలకులు కఠినంగా వ్యవహరిస్తే తప్ప అవినీతి నిర్మూలన సాధ్యం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం అవినీతిని పట్టించుకోనంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటుందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అయితే, ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు భారీగా దండుకునేందుకే చిరుద్యోగులపై అవినీతి ముద్ర వేసారన్న విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి.

Leave a Comment