ఇది ఫైర్ బ్రాండ్ రోజా మాటనా .. అధిష్టానం మాటనా

ఎమ్మెల్యే రోజాకు రాజకీయాల్లో లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ఒక్క ఏపీ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే రోజా మంచి పేరు, అభిమానం సంపాదించుకున్నారు. నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూనే.. బుల్లి తెరపై పలు ప్రోగ్రాం లలో పాల్గొంటూ అందరి మన్ననలు పొందారు. ఆమె రాజకీయ ప్రస్థానం టిడిపితో మొదలు పెట్టినా వైసీపీలో చేరిన తర్వాత వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

టిడిపి తరపున పోటీ చేసిన ప్రతీసారి కూడా ఆమెకు ఓటమితో పాటు ఘోర అవమానాలు తప్పలేదు. దీంతో ఆమెను ఐరన్ లెగ్ అని కామెంట్ చేశారు. కానీ వైసిపిలో చేరి వరుసగా విజయాలు సాధిస్తూ తన మీద ఉన్న ఐరన్ లెగ్ ముద్రను చెరిపేసుకున్నారు. అంతే కాకుండా తన నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. పార్టీ తరఫున బలంగా వాయిస్ వినిపించేవారిలో రోజా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు.

ఐరన్ లెగ్ టు ఫైర్ బ్రాండ్

వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ తర్వాత ఎక్కువగా ఇబ్బంది పడింది రోజానే అని చెప్పాలి. ఎందుకంటె అప్పటి టిడిపి ప్రభుత్వం రోజా మీద చాల కక్షపూరితంగా వ్యవహరించేది. ఒక సంవత్సరం అసెంబ్లీ బహిష్కరణ కూడా చేశారు. అయినా కూడా ఆమె జగన్ వెంటే వుంటూ జగన్ మీద ఈగ వాలకుండా చూసుకునే వారు. ఎవరైనా తమ పార్టీపై, ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటే వారిపై తన వాగ్ధాటితో విరుచుకుపడతారు. అందుకే ఆమెను వైసీపీ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు.

2019 ఎన్నికల్లో వైసీపీ ఏర్పడటంతో రోజా మంత్రి పదవి పై చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ సామాజిక సమీకరణాలు ఆమె మంత్రి పదవికి అడ్డుపడ్డాయి. దీంతో రోజా పార్టీపై కొంతకాలం తన అసంతృప్తిని చూపించారు. ఇది గ్రహించిన సీఎం జగన్ వెంటనే ఆమె క్యాబినెట్ హోదా తో సమానమైన ఏపీఐఐసీ పదవిని కట్టబెట్టారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ లో అయినా తనకు పదవి లభిస్తుందని రోజా కోటి ఆశలు పెట్టుకున్నారు.

షర్మిలపై రోజా ఫైర్ అందుకేనా

తాజాగా వైయస్ షర్మిల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్ను విమర్శిస్తే ఎవరినైనా ఊరుకునే ప్రసక్తి లేదని ఆమె తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొనసాగుతున్న సందర్భంగా దీనిపై ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల సొంత అన్న పైన విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే షర్మిల పై విమర్శలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా ముందుకు రాలేదు.

అయితే తాజాగా షర్మిల సీఎం జగన్ పై చేసిన విమర్శలు పై వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన ఎమ్మెల్యే రోజా స్పందించారు. జగన్ గారిని విమర్శిస్తే సొంత చెల్లి అయినా ఊరుకోబోమని ఆమె హెచ్చరికలు జారీ చేశారు. షర్మిలే కాదు తెలంగాణ నుంచి ఏ ఒక్కరైనా సీఎం జగన్ మీద విమర్శలు చేస్తే దానికి ప్రతి విమర్శలు ఉంటాయని రోజా తెలిపారు. జగన్ ను అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే బెటర్ అని ఆమె సూచన చేశారు. రోజా దూకుడు చూస్తుంటే షర్మిల పై కూడా విమర్శలు చేయడానికి రెడీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరి దీనిపై వైసీపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a Comment