ఆఫ్ఘన్ లో పరిస్థితికి జో బైడెన్ వైఫల్యమే కారణమన్న డోనాల్డ్ ట్రంప్

ఆఫ్ఘన్ లో పరిస్థితికి జో బైడెన్ వైఫల్యమే కారణమన్న డోనాల్డ్ ట్రంప్: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల అరాచకం మళ్లీ మొదలైపోయింది. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్ష భవనంతో సహా అన్ని ప్రాంతాలను తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. దేశంలో మరింత రక్తపాతం ఏర్పడటం ఇష్టం లేకే దేశం విడిచి వెళ్లి పోతున్నట్లుగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక ప్రకటన చేశారు.

మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ లో ఉంటున్న విదేశీయులు కూడా భారీ సంఖ్యలో కాబూల్ విమానాశ్రయం నుంచి నిష్క్రమిస్తున్నారు. దేశంలో యుద్ధం ముగిసినట్లుగా తాలిబన్లు ప్రకటించుకున్నారు. అయితే ఇదే సమయంలో తాలిబన్లు విమానాశ్రయాలన్ని కూడా నిలిపివేస్తున్నారు.

ఇక దేశంలో యుద్ధం ముగిసినట్లుగా తాలిబన్లు ప్రకటించుకున్న నేపథ్యంలో.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆఫ్ఘనిస్థాన్ అధికార పగ్గాలను తాలిబన్లు సొంతం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ సైనికుల నిష్క్రమణకు ఆగస్టు 31 వరకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ గతంలో డెడ్ లైన్ ఇవ్వగా.. రెండు వారాలకు ముందే ఆదివారం నాడు తాలిబన్లు ఆఫ్ఘాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ( తాలిబన్ల అధీనంలోకి ఆఫ్ఘనిస్థాన్ )

ఆఫ్ఘనిస్థాన్ లో నెలకొన్న పరిస్థితులపై అమెరికాలో ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆఫ్ఘన్ లో నెలకొన్న పరిస్థితులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైఫల్యమే కారణమని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ దుస్థితికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి బైడెన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు దేశంలో కోవిడ్-19 విజృంభణ, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, అమెరికాలోకి వలసలు పెరగడానికి బైడెన్ చేతకాని తనమే కారణమని విమర్శించారు డోనాల్డ్ ట్రంపు. ఆఫ్ఘన్ విషయంలో బైడెన్ ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు.

Donald Trump - Joe Biden
Donald Trump – Joe Biden

అమెరికా చరిత్రలో అతి ఘోరమైన ఓటమిలో ఒకటిగా ఆఫ్ఘన్ పరాభవం ఎప్పటికీ నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. నిజంగానే ట్రంప్ ను మిస్ అవుతున్న భావనలోకి వెళ్తున్నామని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అయితే ట్రంప్ ఆరోపణల్ని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తిప్పికొట్టింది. ఆఫ్ఘన్ నుంచి అమెరికా సైనికుల ఉపసంహరణకు.. తాలిబన్లతో డీల్ కుదుర్చుకునేందుకు ట్రంప్ చర్చలు జరిపారని గుర్తుచేశారు. ఇక యుద్ధాలను ముగించాలని అమెరికాలోని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు.

అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనల నిష్క్రమణలను సరిగా నిర్వహించడంలో జో బైడెన్ విఫలమయ్యారని స్వదేశం నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడి పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడంలో బైడెన్ విఫలం చెందారని రాజకీయ ప్రత్యర్థులు, మీడియా సంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఇదే సమయంలో గతంలో అఫ్ఘనిస్తాన్ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటన, వేసిన అంచనా పూర్తిగా తప్పని తేలిపోయింది. తాలిబన్లు ఆఫ్ఘన్ ను స్వాధీన పరచుకుంటారా అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు, ఆయన అది అసాధ్యమని చెప్పారు. ఆఫ్ఘాన్ దళాలు 3లక్షల వరకు ఉన్నారని.. పైగా వారికి యుద్ధ సామర్థ్యం ఉందని.. ప్రపంచంలో మరే ఆర్మీకి లేనంత సత్తా కూడా వారి సొంతమని ఆయన చెప్పుకొచ్చారు.

తాలిబన్ల సంఖ్య సుమారు 75 వేలు మాత్రమే అని చెప్పారు. తాలిబన్లు ఆఫ్గాన్ ను స్వాధీనం చేసుకోవడం కల్లా అని ఆయన కుండబద్దలు కొట్టారు. కాబూల్ నగరంలో అమెరికా జాతీయ పతాకం రెపరెపలాదుతూనే ఉంటుందని ధీమాగా చెప్పారు. వియత్నాం యుద్ధానికి.. దీనికి సంబంధం లేదని కూడా చెప్పారు. ఇది గత జూలై 8 నాటి మాట.

Credits from Youtube

అయితే నాటి ఆయన వ్యాఖ్యలకు, నేటి ఆఫ్ఘాన్ పరిస్థితులకు ఎలాంటి పొంతన లేదన్న విషయం ఇక్కడ మనకు అర్ధమవుతోంది. నిజానికి కాబూల్ నగరాన్ని తాలిబన్లు కైవసం చేసుకోవడానికి సుమారుగా మూడు నెలల సమయం పట్టవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అంచనా వేశాయి. ఆ అంచనా కూడా ఇప్పుడు తప్పని తేలిపోయింది. మూడు నెలలు కాదు కదా.. మూడు వారాల్లోనే ఈ నగరంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రవేశించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్ని చీకటి లోకంలోకి నెట్టేశారు.

More Latest telugu newsOnline telugu newsPolitical newsonline news today

1 thought on “ఆఫ్ఘన్ లో పరిస్థితికి జో బైడెన్ వైఫల్యమే కారణమన్న డోనాల్డ్ ట్రంప్”

Leave a Comment