నాకు వచ్చిందంటే కరోనా ప్రమాదమే..అందరూ జాగ్రత్తగా వుండండి..

ఉచిత సలహాలివ్వడం చాలా తేలికే. విషయం తనదాకా వస్తేగానీ తెలియదంటారు పెద్దలు. ఇతరులకు సమస్య వస్తే ఉచిత సలహాలిచ్చి.. అదే సమస్య మనకు వస్తే గాబరా పడడం చాలాసార్లు మనకూ ఎదురయ్యే ఉంటుంది.

ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు. కరోనా ప్రారంభంలో దానిని చాలా చులకన చేసి మాట్లాడారు. హేళనగా కూడా మాట్లాడారు. మాస్కు పెట్టుకుంటే కరోనా రాదా.. కరోనాకు భయపడాల్సిన పనిలేదు. నేను మాస్క్‌ పెట్టుకోను.. మీరూ పెట్టుకోకండి అని దేశ ప్రజలకు కూడా చెప్పారు.

కరోనా కట్టడికోసం దేశాలన్నీ లాక్‌డౌన్‌ ప్రకటిస్తుంటే ట్రంప్‌ మాత్రం లాక్‌డౌన్‌ ప్రకటించేది లేదని భీష్మించారు. కానీ, అలాంటి వ్యక్తిలో కూడా మార్పు తెచ్చింది కరోనా. ట్రంప్‌నకు కూడా కరోనా రావడంతో అతని పరివర్తనలో చాలా మార్పు వచ్చింది. చివరకు కరోనా ఆయనకు చాలా నేర్పించిందట. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. ట్రంప్‌నకు కరోనా రావడంతో నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టారు.

అందులో భాగంగానే ఆయన ఆసుపత్రి నుంచి శ్వేతసౌధానికి వచ్చిన తర్వాత 74 ఏళ్ల తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా లిఫ్ట్‌ వాడకుండా మెట్లెక్కి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నుంచి తాను చాలా నేర్చుకున్నానని, అందరూ కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మనమంతా కలిసి వైరస్‌పై విజయం సాధిద్దాం అని పిలుపునిచ్చారు. ఈ పరిణామాలను చూస్తున్న వారు మాత్రం ఔరా ఎంతలో ఎంత మార్పు.. కరోనాను హేళన చేసి.. తక్కువగా మాట్లాడిన ట్రంప్‌లో కరోనా ఎంత మార్పు తెచ్చిందో గదా అనుకుంటున్నారు. ఎవరికైనా తనదాకా వస్తే గానీ తెలియదు మరి అని పాత సామెతను గుర్తు చేసుకుంటున్నారు.

Leave a Comment