బీజేపీ చాలా క్రమశిక్షణ పార్టీ. వాస్తవానికి భారతదేశంలో క్రమశిక్షణ కలిగిన పార్టీల్లో వామపక్షాల తర్వాత బీజేపీనే చెప్పుకుంటారు. కానీ, ఇటీవల కాలంలో బీజేపీలో కూడా క్రమశిక్షణ ఉల్లంఘన జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడు అది ఏకంగా త్రిపురలో ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెట్టే స్థాయికి చేరింది.
2018లో త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా సీపీఎంను ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎప్పటినుంచో అధికారంలో ఉన్న సీపీఎంను ఓడించిన బీజేపీకి అక్కడ అసెంబ్లీలో కాలు పెట్టడానికి అనేక సంవత్సరాలు పట్టింది. చివరకు అక్కడ అనేక రకాలుగా పావులు కదిపిన బీజేపీ సీపీఎంను ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకొంది. అప్పటి నుంచి విప్లవ్‌దేవ్ సీఎంగా కొనసాగుతున్నారు.
అయితే, కేవలం రెండు సంవత్సరాల్లోనే అక్కడి బీజేపీలో పరిస్థితులు మారిపోయాయి. 11మంది బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంపైనే తిరుగుబాటు చేశారు. ఏదైనా సమస్య వస్తే క్రమశిక్షణాయుతంగా దానిని పరిష్కరించుకుంటుందన్న పేరు కలిగిన కమలం పార్టీలో ఒక్కసారిగా కలకలం రేపింది. సీఎం తమను పట్టించుకోవడం లేదని వారంతా సీఎంకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెట్టారు. చివరకు అతడిపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ బాట కూడా పట్టారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి సీఎంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కనీస గౌరవం ఇవ్వడం లేదని వారు ఫిర్యాదు చేయనున్నారట.
వాస్తవానికి బీజేపీ అక్కడ అధికారమే పరమావధిగా ఎవరికి పడితే వారికి (బాగా డబ్బున్న వారికి, పెట్టుబడిదారులకు) టికెట్లు ఇచ్చిందని, వారు ఆ ఎన్నికల్లో గెలిచేందుకు పెద్ద ఎత్తున డబ్బులు వెదజల్లుతున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం అయింది. ఎన్నికల కమిషన్‌కు కూడా అనేక ఫిర్యాదులు వెళ్లాయి. కానీ, వాటిని ఎవరూ పట్టించుకోలేదు. చివరకు వారు గెలిచారు.
ఇప్పుడు డబ్బు, పలుకుబడి ఉన్న తమ వల్లే త్రిపురలో బీజేపీ గెలిచిందని, సీఎం విప్లవ్‌దేవ్ వల్ల పార్టీ అధికారంలోకి రాలేదని, ఆయనను చూసి జనం ఓట్లేయలేదన్న భావనలో అసంతృప్త ఎమ్మెల్యేలు ఎప్పటినుంచో ఉన్నారట. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉంటే మా పరిస్థితి ఏంటి అన్న ఆలోచనకు వచ్చిన ఆ 11మంది ఎమ్మెల్యేలు తాడోపేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.
పార్టీ క్రమశిక్షణ కంటే తమ మనుగడ, తమకు ప్రాధాన్యం ఇవ్వడమే ముఖ్యమన్న ధోరణిలో ఉన్న ఆ ఎమ్మెల్యేలు అధిష్టానానికే వార్నింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని కూడా జోరుగా చర్చ సాగుతోంది. తమకు ప్రాధాన్యం ఇవ్వకుంటే త్రిపురలో పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందో కూడా చెప్పాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగానే వారు పార్టీ జాతీయ నేతలను కలుస్తున్నారట.
పార్టీ అధిష్టానం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కూడా కలుగుతోంది. వాస్తవానికి తమది క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకుంటున్న ఆ పార్టీ పెద్దలు సీఎంపై తిరుగుబాటు చేసిన ఆ 11మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా.. లేక వారి మాట విని సీఎంపై వేటు వేస్తారా..? ఇద్దరినీ పిలిచి రాజీ కుదురుస్తారా అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మొత్తానికి రాక రాక అధికారంలోకి వస్తే అప్పుడే ఈ పంచాయితీ ఏంట్రా బాబు అనుకుంటూ కమలనాథులు తలలు పట్టుకుంటున్నారట. అయితే, ఈ పంచాయితీ సద్దుమణుగుతుందా.. లేక అధికారం కోల్పోయే పరిస్థితికి దారితీస్తుందా అనేది మున్ముందు తేలుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో ఏది జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతున్నారు.