డిజిటల్ లోనే విద్యాబోధన..ఇక నుండి ప్రభుత్వ పాఠశాలల్లో..

డిజిటల్ లోనే విద్యాబోధన : మారుతున్న కాలంతో పాటు మారకపోతే ఏ రంగమైనా అభివృద్ధి పథంలో నడవదు. నవీన కాలంలో అంతా సెల్ ఫోన్, లాప్ టాప్ ల మాయలో ప్రతిదీ డిజిటలైజ్ చేస్తే తప్ప బ్రతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత ప్రపంచం మొత్తం సెల్ ఫోన్ లలోకి వచ్చేసింది. ఏ సమాచారం కావాలన్నా సమాధానం గూగుల్ లోనే దొరుకుతుంది. విద్య, వైద్యం, అమ్మకాలు, కొనుగోలు, పరిశోధనలు ఇలా అన్నీ ఆన్లైన్ లో జరిగే కాలంలో మనం బతుకుతున్నాం. కరోనా దాడి తర్వాత ఇది మరీ ఎక్కువైపోయింది. ( Digital Currency )

పిల్లలకు విద్యాబోధన ఆన్లైన్ లో జరిగే పరిస్థితులను గత రెండేళ్లుగా చూస్తూనే వున్నాం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసి విద్యాబోధనను డిజిటలైజ్ చేయాలని భావిస్తున్నాయి. సెల్ఫోన్ల ద్వారా కంటే డిజిటల్ బోర్డుల ద్వారా విద్యాబోధన చేస్తే మరింత నాణ్యమైన పద్ధతుల్లో భోధన జరిగే అవకాశం ఉంటుందని.. ఒకవేళ కరోనా కాలం దాటి యధావిధిగా పాఠశాలల్లోనే విద్యాబోధన జరిగినా, బోర్డులపై రాసి.. బొమ్మలు గీసి పాఠాలు చెప్పడం కంటే డిజిటల్ బోర్డు ద్వారా చెప్పడం సులువవుతుంది. ఎక్కువ సమాచారం బొమ్మల రూపంలో అర్థమయ్యే పద్ధతిలో.. ఒక సారి నిక్షిప్తం చేస్తే ఉపాధ్యాయులకు కూడా చాల సులువుగా విద్యాబోధన చేయవచ్చు.  ( మరికొన్ని వార్తలు )

డిజిటల్ విద్యాబోధన పాఠశాలల్లోనే

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల వైపు పిల్లల్ని మళ్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం 2020 – 21 విద్యా సంవత్సరానికి రెండు వేల పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ లు, డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ బోర్డులకు అయ్యే ఖర్చును 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 26,800 ప్రభుత్వ పాఠశాలలో వీటిని ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులకు మేలు జరిగినట్లు అవుతుంది. అదే సమయంలో ప్రైవేటు విద్యా వ్యవస్థ కూడా తమ విద్యాబోధనను డిజిటలైసెషన్ పద్ధతిలోకి మార్చుకోకపోతే పూర్తిగా కుదేలయ్యే అవకాశం ఉంది.

నాణ్యమైన విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలలో దొరికినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు అటువైపు ఆకర్షితులవుతారు. ప్రైవేటు పాఠశాలలో ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లిస్తున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలకు ధీటైన సదుపాయాలు ప్రైవేట్ పాఠశాలలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలలో కూడా రానున్న రోజుల్లో డిజిటల్ విద్యావిధానం తప్పనిసరి అవుతుంది. ఏదిఏమైనా అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు విద్యా విధానం మరింత మెరుగు పెడితే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు భవిష్యత్తులో ప్రయోజకులవుతారు.