ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి ఢిల్లీ హై కోర్ట్ షాక్..

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విలేకరుల సమావేశంలోగానీ లేదా మరో బహిరంగ వేదికపై నుండి ఇచ్చే హామీల అమలు నెరవేరకపోతే ప్రజలు వాటిని న్యాయస్థానాల ద్వారా సాధించవచ్చని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కరోనా కష్టకాలంలో ఇంటి అద్దె కట్టలేని వలస కార్మికుల ఇంటి అద్దె బకాయిలను తామే చెల్లిస్తామని గత ఏడాది మార్చిలో లాక్ డౌన్ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. దీని పై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది.

వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోండి

కేజ్రీవాల్ ఎవరినైతే దృష్టిలో ఉంచుకొని ఆ ప్రకటన చేశారో, వారి విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ హామీ అమలుపై ఆరువారాల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభ గురువారం తీర్పు వెలువరించారు. సీఎం హామీ ఇచ్చిన సంక్షోభ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ హామీ అమలుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఏకపక్షం కిందకు రాదని.. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండటంమే చట్టవ్యతిరేకం అవుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి స్థానంలో వున్నా వ్యక్తి ఒకసారి హామీ ఇచ్చాక ఆ హామీని అమలు చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని తీలుసుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం పై ఉంటుందని స్పష్టం చేశారు. అప్పటి హామీని లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన ఇంటి యజమానులు, కిరాయి దారుల వర్గాల గాయాలకు ఉపశమనంగా సీఎం ప్రకటించారని.. అలాంటి హామీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయకుండా పూర్తిగా విస్మరించిందో తెలియడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ కారణంగా

లాక్ డౌన్ తో మొదలైన భారీ వలసల నేపథ్యంలో ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటనను ప్రభుత్వం తేలిగ్గా పక్కన పెట్టడం కుదరదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ పై నిర్ణయం తీసుకున్నప్పుడే అది సరైన పాలనగా గుర్తింపు పొందుతుందని తేల్చి చెప్పారు. ఏమీ తేల్చకుండా నాన్చడం సమస్యకు సమాధానం కాదని 89 పేజీల తీర్పులో పేర్కొన్నారు. ( బెయిల్ కావాలంటే )

గత ఏడాది మార్చి 29న కేజ్రీవాల్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ కిరాయిదారులు, ఇంటి యజమానులు వేసిన పిటిషన్ పై జస్టిస్ ప్రతిభ ఈ తీర్పు వెలువరించారు. ఇంటి అద్దె చెల్లించలేని వారు చెల్లించనవసరం లేదని నాటి విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ చెప్పారు. ఇంటి యజమానులు కూడా కిరాయి కోసం బలవంతము చేయొద్దని.. ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని తెలిపారు. సీఎం ఇచ్చిన హామీ లేదా చేసిన ప్రకటన స్పష్టంగా అమలు చేయదగ్గ వాగ్దానం అవుతుందని జస్టిస్ ప్రతిభ తన తీర్పులో స్పష్టంగా చెప్పారు. దాని అమలు అంశాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

హామీలు నెరవేర్చడం ప్రభత్వం భాద్యత

సుపరిపాలనలో పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీలను సహేతుకమైన కారణం లేకుండా పక్కకు పెట్టకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన విషయానికి వచ్చే సరికి ప్రభుత్వము, అధికారులు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలన్న లక్ష్యంతోనే మాట తప్పడం కుదరదని.. అలా చేయడం వల్లనే హామీలు వాటికి చట్టబద్ధత అనే సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎలాంటి సంశయం లేకుండా అంగీకరిస్తున్నప్పుడు దానిపై ఎలాంటి చర్య లేకపోవడాన్ని ఏమాత్రం అనుమతించరాదని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతగా ఎన్నికైన వ్యక్తులు, బాధ్యత కలిగిన హోదాలో ఉన్న వారు సంక్షోభ సమయాల్లో తమ పౌరులకు బాధ్యత కలిగిన హామీలను ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తారని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ పాలన మొత్తం రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ పేరిట జరుగుతోందని.. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు చట్టబద్ధత లేదని ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆ కారణం చూపి ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించుకోలేరు అని స్పష్టం చేసింది.

మరి పార్లమెంట్ లో ఇచ్చిన హామీల పరిస్థితి

ఈ తీర్పుపై కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూనే.. “ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఏకంగా పార్లమెంట్ వేదికగా ఒక ప్రధాని మాట ఇచ్చాడు. దానిని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము అమలు చేయలేదు. ఏమంటే మాటే ఇచ్చారు గానీ దానిని చట్టం చేయలేదు అంటున్నారు. మరి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటకే భరోసా లేకపోతే.. ఏ న్యాయస్థానాలు పట్టించుకోకపోతే ఇలాంటి మరికొన్ని హామీలు, ప్రకటలు చేయడానికి ఎవరూ ఆలోచించరు” అంటూ తమ ఆవేదనను వెలిబుచ్చారు.

Leave a Comment