రోజువారీ విచారణ.. జగన్ కు లాభమా.. నష్టమా.. !!

కేసుల విచారణ జోరు పెరిగితే జగన్ కు లాభమా.. నష్టమా.. జగన్ గత పదేళ్లుగా కోర్టుల వెంట తిరుగుతున్నారు. ఆయనకు రాజకీయం కంటే ముందు సీబీఐ కేసులే ఎదురయ్యాయి. పదవుల కంటే ముందే జైలుగోడలే స్వాగతం పలికాయి. నిజానికి జగన్ మీద 11 ఛార్జ్ షీట్లు నమోదయ్యాయి. అన్నీ కలిపి పదమూడు వందల కోట్లు మాత్రమేనని అప్పట్లో విచారణ జరిపిన అధికారులు ఇప్పుడు చెబుతున్నారు.

అయితే లక్ష కోట్లు అన్నమాటకు తగ్గకుండా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. అసలు వేల కోట్లు, ఏమా కేసులు అన్న దాని మీద ఇప్పటికీ ప్రజలకు క్లారిటీ లేదు. జగన్ మీద అభిమానంతో ఆయనను సీఎంగా ఒక్కసారైనా చూడాలన్న ఆసక్తితో జనం 2019 ఎన్నికల్లో గెలిపించారు. ప్రజాకోర్టులో గెలిచినంత మాత్రాన జగన్ నిర్దోషి కాదు.. అలాగని కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన దోషి కూడా కాదు.

ఈ మధ్య సుప్రీం కోర్టు ప్రజాప్రతినిధుల కేసులను తొందరగా విచారించాలని హైకోర్టులకు సూచించింది. దానికోసం టైం బాండ్ ప్రోగ్రాం లో పెట్టుకొని ప్రత్యేక కోట్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి రోజువారీ విచారణ చేయాలని కూడా సూచించింది. దేశవ్యాప్తంగా 4 వేల మంది పైచిలుకు ప్రజాప్రతినిధులు కేసుల్లో ఇరుక్కున్నారు. దేశంలో ఉన్న కోర్టులు, సిబ్బంది చూస్తే మాత్రం సరిపోఋ. కానీ ప్రయారిటీ లో పెట్టి రోజుల తరబడి విచారణ చేస్తే చాలా కేసులు ఒక కొలిక్కి వస్తాయి అని అంటున్నారు.

అలా కేసులు స్పీడ్ అందుకుంటే జగన్ కు ఇబ్బంది కలుగుతుందా అన్న చర్చ అయితే వైసీపీలో ఉంది. ఇక తన మీద పెట్టిన కేసులు అన్ని రాజకీయ ప్రేరేపితమైనవాని జగన్ అంటూ వచ్చారు. తాను కాంగ్రెస్లో ఉంటే ఆణిముత్యమని, బయటకొచ్చాను కాబట్టే కేసులు పెట్టారని ఆయన వాదించారు. దానికి అనేక రుజువులు కూడా ఆయన చూపారు. దానిని జనం బలంగా నమ్మారు కాబట్టి ఆయనకు 151 సీట్లు అప్పగించారు.

కేసుల్లో పసలేదు.. వైసీపీ వాదన

ఈ కేసులో పసలేదు అని వైసీపీ నేత అంబటి రాంబాబు లాంటి వారు చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఇక జగన్ అయితే ఓ సందర్భంలో తన మీద పెట్టిన కేసులు తొందరగా విచారించాలని కూడా కోర్టును కోరారు. నిజంగా ఇది అరుదైన సందర్భమే. మరి జగన్ కి అంత నమ్మకం లేకపోతే తన కేసులను త్వరగా విచారించమని కోరు కదా. అంటే జగన్ కడిగిన ముత్యంలా వస్తారని వైసిపి నేతలు గట్టిగా నమ్ముతున్నారు.

ఇక సుప్రీం కోర్టు జగన్ మీద కేసులు తొందరగా విచారణ జరిగితే కనీసం రెండేళ్ళ వ్యవధిలో అయినా ఈ కేసులో తీర్పు వస్తుంది. మరి అది జగన్ కి లాభమా.. నష్టమా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరో రెండేళ్లు అంటే కచ్చితంగా సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న అతి కీలకమైన సమయం అన్నమాట.

టీడీపీ వాదన

సీబీఐ పెట్టిన కేసుల లో జగన్ ఎక్కడో అక్కడ దొరికిపోతారు అని టిడిపి బలంగా నమ్ముతోంది. వైసీపీ నేతలు మాత్రం తమ నేత నిర్దోషిగా బయటకు వస్తారని విశ్వసిస్తున్నారు. అదే జరిగితే జగన్ కు రాజకీయంగా లాభం కలగడమే కాదు.. ఇక టీడీపీకి కనీసం ఒక్క మాట కూడా జగన్ ను అనే అవకాశం కూడా ఎవరికీ ఉండదు. ప్రత్యేక కోర్టులు పెట్టి మరీ జగన్ కేసులో రోజువారీ విచారణ జరిపితే రాజకీయంగా ఎవరు దొరుకుతారు అన్నది చూడాలి.

Leave a Comment