జంపింగ్ ఎమ్మెల్యేలా.. కోవర్టులా..

జంపింగ్ ఎమ్మెల్యే టిడిపి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారన్న ఆరోపణలతో వైసీపీలో కలవరం మొదలైంది. కరణం బలరామకృష్ణమూర్తి రాజకీయాల్లో సీనియర్ మోస్ట్. దాదాపు ముప్పై ఏళ్లుగా ఆయన రాజకీయాలు చేస్తున్నారు. దాదాపు ఒకే పార్టీలో ఆయన చాలా ఏళ్లుగా చక్రం తిప్పారు. అలాంటి నేతపై ఇప్పుడు ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఆయన కదలికలపై నిఘా పెట్టిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తాజాగా బాంబు పేల్చారు. కరణం బలరాం తన స్వప్రయోజనాల కోసమే కాదు, చంద్రబాబు కనుసన్నల్లోనే పార్టీ మారి వైసిపి ఉన్నారని, ఆయన వ్యవహారాన్ని ఆధారాలతో పాటు బయట పేడతానాని అంతర్గత సమావేశాల్లో ఆమంచి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో ఒక్కసారిగా కరణం వ్యవహారం చర్చకు వచ్చింది.

ఆదినుంచీ కరణం వివాదాస్పద నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎవరితోనూ పొసగదు. ఇది ఎప్పటి నుంచో ఆయనపై ఉన్న వ్యాఖ్యలే. ఈ విషయంపై జిల్లాలోనూ, టిడిపిలోనూ చర్చకు వచ్చేవే. అయితే ఇప్పుడు సంచలన విషయం ఒకటి వెలుగుచూసింది. ఆయన గత ఏడాది ఎన్నికల్లో చీరాలలో విజయం సాధించారు. అయితే అనూహ్యంగా ఆయన తన కుమారుడు వెంకటేష్ ను తీసుకొచ్చి వైసీపీలో చేర్పించి తాను కూడా మద్దతుదారుగా మారిపోయారు.

ఇక అప్పటి నుంచి నాకు అది కావాలి ఇది కావాలి అని వైసిపిలో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకునేలా చేసి తన పనులు చేయించుకుంటున్నారు. అదే సమయంలో తనకు అనుకూలమైన అధికారులను బదిలీ చేయించుకున్నారు. ఇంతవరకు కారణం పరిమితమైతే బాగానే ఉండేది కానీ ఇంతకు మించి ఆయన వ్యవహారశైలి ఉండడమే ఇప్పుడు వివాదాలకు కారణమవుతోంది.

అదేంటంటే టిడిపిలో ఉన్నప్పుడు పార్టీలో ముఖ్యుల కోసం వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు. టిడిపి వీఐపీ గ్రూప్ గా వ్యవహరించే దీనిలో మొత్తం 38 నాయకులున్నారు. వీరిలో చంద్రబాబు, లోకేష్, యనమల వంటి దిగ్గజ నాయకులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దీనికి అడ్మిన్ గా ఉన్న వారిలో కరణం బలరాం కూడా ఉన్నారు.

ఆయన పార్టీ మారినప్పుడు కచ్చితంగా టిడిపిలో ఉన్న అన్ని అనుబంధాలను తెంచుకుని రావాలి. కానీ కరణం మాత్రం టిడిపి వీఐపి వాట్సాప్ గ్రూప్ లో ఇప్పటికీ అడ్మిన్ గానే ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి ఆరోపిస్తున్నారు. అంతేకాదు నిత్యం వైసీపీలో జరుగుతున్న పరిణామాలను తన కుమారుడు వెంకటేష్, నారా లోకేష్ కు చేరవేస్తున్నదని ఆయన చెబుతున్నారు.

ఆయన వైసీపీ సానుభూతి పరుడుగా ఉంటూ టీడీపీకి కోవర్టుగా పని చేస్తున్నారని ఆమంచి ఆరోపించారు. అంతేకాదు పరిటాల శ్రీరామ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు తోనూ వెంకటేష్ కు సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని.. ఇది వైసీపీకి ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా వివాదం రగులుకుంది. దీనిపై ఆధారాలతో త్వరలోనే తాను బట్టబయలు చేస్తానని ఆమంచి చెప్పుకొచ్చారు. మరి ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.

Leave a Comment