మరో మారు విరుచుకు పడుతున్న కరోనా.. బ్రిటన్ లాక్ డౌన్ ..!!

అసలు ఈ కోవిడ్ అదుపులోకి వస్తుందా.. ! ఒక్కో దేశంలో ఒక్కోలా ఈ వైరస్ విరుచుకు పడుతున్న తీరు చూస్తుంటే అది అంత సులువు కాదని అనిపిస్తుంది. ఎందుకంటే భారత్లో కొంతవరకు రికవరీ రేటు కేసులు నమోదు కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ అమెరికా, యుకె వంటి దేశాల్లో పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా బ్రిటన్ దేశంలో కరోనా వైరస్ ఉత్పరివర్తన చెంది అంటే ఇది తన రూపాన్ని, లక్షణాలను మార్చుకుని కలకలం సృష్టిస్తోంది. అనేక మంది కరోనా బారిన పడుతుండటమే కాకుండా అధిక సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ దేశానికి పలు దేశాలు విమానాలు రద్దు చేశాయి. అంతే కాకుండా బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై కూడా నిషేధం విధించాయి.

ఇటు భారత్ కూడా అక్కడి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని విమానాలపై నిషేధం విధించింది. యూకేలో కరోనా ఉత్పరివర్తన పై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రేపు అర్ధరాత్రి నుంచి నెలాఖరు వరకు బ్రిటన్ నుంచి రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించారు.

మరోవైపు భారత్లో అటువంటి పరిస్థితులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా కరోనా ఉత్పరివర్తన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ప్లాన్స్ అన్నింటినీ మార్చుకోవాల్సిందిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజలను రిక్వెస్ట్ చేశారు.

యూకేలో కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దానిని అరికట్టడానికి లండన్ సహా దక్షిణ ఇంగ్లండ్లో కఠిన లాక్ డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.

ఈ క్రిస్మస్ ను ఓ ప్రణాళిక ప్రకారం నిర్వహించుకునే అవకాశాలు లేకపోవడం చాలా బాధగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తోందని.. ఈ వైరస్ 70 శాతం ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతోందని యూకే ప్రధాన వైద్యాధికారి తెలిపారు.

గత కొద్దిరోజుల నుంచి నమోదైన కేసులలో 60 శాతం కంటే ఎక్కువ కొత్తరకం వైరస్ ను గుర్తించినట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కొత్త రకం వైరస్ ను వాక్సిన్ నిరోధిస్తుంది అని చెప్పడానికి ఆధారాలు లేవని కూడా తెలిపారు.

కాగా యూకేలో కరోనా టీకా పంపిణీ కూడా కొనసాగుతోంది. ఫైజర్ టీకాకు యూకే ఈ నెల 8న అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. యూకేలో మొదటివారంలో సుమారు 1.37 లక్షల మందికి పైగా మొదటి డోసు అందింది.

అయినా సరే ముందు జాగ్రత్త చర్యలు, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తాజా లాక్ డౌన్ విధించారు. ఈ సందర్భంగా కోవిడ్ అదుపులోకి వచ్చేసింది అనే భ్రమ వీడాలని.. లేదంటే బ్రిటన్ వంటి పరిస్థితులు ఏ దేశానికైనా రావొచ్చని వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Leave a Comment