వైఎస్ విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంపై కాంగ్రెస్ పార్టీ నిఘా..!

వైయస్ హయాంలో ఆయన క్యాబినెట్ లో పనిచేసిన నేతలతో మరియు ఆయనతో ఆత్మీయంగా ఉన్న వ్యక్తులతో వైఎస్ విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం కాంగ్రెస్ పార్టీని ఉలిక్కిపడేలా చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఆ పార్టీ అనుమానిస్తోంది. ఇప్పటికే కె.వి.పి.రామచంద్రరావు తనకు ఆహ్వానం అందిందని.. తాను ఆ కార్యక్రమానికి వెళ్తున్నానని ప్రకటించారు. వైయస్ కుటుంబంతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఆత్మీయ సమ్మేళనంకి వెళ్తున్నానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించారు.

టెన్షన్ పెడుతున్న వైఎస్ విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం

ఇలా ఒక్కొక్కరుగా సమావేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండడం.. కాంగ్రెస్ సీనియర్ నేతలైన జానారెడ్డి, జీవం రెడ్డి, దామోదర రాజనర్సింహ లాంటి వారికి కూడా వైఎస్ విజయమ్మ నుంచి ఆహ్వానం అందిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. కెవిపి, కోమటిరెడ్డి బాటలోనే ఇతర కాంగ్రెస్ నేతలు కూడా వైఎస్ విజయమ్మ నిర్వహించే సమావేశానికి వెళితే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ( స్కూల్స్ రీఓపెన్ పై భిన్నాభిప్రాయాలు )

ఈ నేపథ్యంలోనే ఏపీసీసీ, టిపిసిసి కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. వైయస్ విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంకి కాంగ్రెస్ నేతలు ఎవరూ వెళ్లవద్దని రాజకీయ సూచన చేసింది. ఎవరైనా వెళ్తే దాన్ని వ్యక్తిగతంగానే భావిస్తామని రెండు పీసీసీలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో వ్యక్తిగత పరిచయాల పేరుతో సమ్మేళనానికి వెళ్లిన నేతల వివరాలను ఏఐసీసీకి పంపిస్తామని కూడా రెండు పీసీసీలు హెచ్చరించాయి.

వైయస్ చనిపోయిన పన్నెండేళ్ల తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారంటే అది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపితమైనని టిపిసిసి అభిప్రాయపడుతోంది. రాజకీయాలతో సంబంధం లేని కార్యక్రమమే అయితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు రావడం లేదని కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. పీసీసీల నుంచి ఈ సూచన రావడానికి ముందే కెవిపి, కోమటిరెడ్డిలు తాము విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంకు వెళుతున్నట్లు ప్రకటించారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని పీసీసీ ఇచ్చిన సూచనలను కోమటిరెడ్డి పాటించి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. వైయస్ కు ఆత్మలాంటి కెవిపి కూడా పీసీసీలు చేస్తున్న పరోక్ష హెచ్చరికలుకు భయపడి వెనక్కి తగ్గే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మిగిలిన నేతలు కూడా ఈ సమ్మేళనానికి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి అదో ఇబ్బందికరమైన పరిస్థితిగానే భావించాల్సి ఉంటుంది. ఎవరెవరు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.. అక్కడ ఏమి జరుగుతుంది అన్నది చూడాలి.

Leave a Comment