Cobas-8800 | రోజుకు 4వేల టెస్టులు ..నిమ్స్ లో ..!

తెలంగాణ ప్రభుత్వం నిరీక్షణకు తగిన ఫలితం దక్కింది. పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు చేసే cobas-8800 నిమ్స్ హాస్పిటల్ కు చేరుకున్నది. 24 గంటల వ్యవధిలో 4,128 ఆర్టీపీసీ పరీక్షలు చేసే సామర్థ్యం ఇది కలిగివుంది.

నాలుగు గంటల్లోనే కరోనా పరీక్షా ఫలితాలు కూడా వెల్లడిస్తారు. ఈ యంత్రానికి ఉన్న ప్రత్యేకత ఇది. కరోనా పరీక్షల్లో అత్యంత కచ్చితత్వం తెలిపేదే ఆర్టీపీసీఆర్ విధానం. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఈ పరీక్షలకు కనీనం రెండు రోజుల వరకు సమయం పడుతున్నది. ఇలా ఆలస్యం కావడం మూలంగా పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

చాలా మందికి లక్షణాలు ఉన్నప్పటికీ ఆర్టీపీసీఆర్ రిపోర్టు లేకపోవడం మూలంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు. కనీసం ట్రీట్ మెంట్ కూడా ప్రారంభించడం లేదు.

కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు

రెండు నెలల క్రితం ఈ యంత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ చేసింది.
జూన్ 8న చెన్నై ఓడరేవు చేరుకోగానే కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు వేసింది. ఈ యంత్రాన్ని తెలంగాణకు రానీయకుండా బలవంతంగా పశ్చిమ బెంగాల్ కు తరలించారు. దీనిపై అప్పట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రంపై భగ్గుమన్నారు.

తాము ఆర్డర్ చేస్తే, బెంగాల్ కు తరలించారంటూ మండిపడ్డారు. ఆ తరువాత మరో యంత్రాన్ని ఆర్డర్ చేయగా అది బుధవారం నాడు పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ చేరుకున్నది. యంత్రం హైదరాబాద్ రాక ముందే రూ.1 కోటి వెచ్చించి ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశారు.
పది రోజుల్లో యంత్రాన్ని బిగించి పరీక్షలు ప్రారంభించనున్నారు. స్విట్జర్ లాండ్ దేశంలో తయారైన ఈ కోబాస్-8800 యంత్రాన్ని రాంకీ సంస్థ (సీఎస్ఆర్) కింద కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వానికి అందచేసింది.

Leave a Comment