పార్లమెంట్ చట్టాల్లో నాణ్యత లోపం.. జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు..మరి మిగతా వాటి సంగతేంటి..

పార్లమెంట్ చట్టాల్లో నాణ్యత లోపం : పార్లమెంట్ పని తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్లమెంట్ తీరు పట్ల విచారం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో జాతీయ పతాకాన్ని ఎగుర వేసిన తర్వాత మాట్లాడిన ఆయన, పార్లమెంట్లో చట్టాలపై లోతైన చర్చ జరగడం లేదన్నారు. ఏ చట్టం ఎందుకు చేస్తున్నారో, ఎవరికోసం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి ఉందని విచారం వ్యక్తం చేశారు.

అప్పట్లో పార్లమెంటులో న్యాయవాదులు ఎక్కువగా ఉండే వారిని.. అందుకే గతంలో అద్భుతమైన చర్చ జరిగి మంచి చట్టాలు వచ్చేవని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. చట్టసభల్లో మేధావులు లేకపోవడం వల్లే లోతైన చర్చలు జరగడం లేదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ చేస్తున్న చట్టాల్లో ఎన్నో లోపాలుంటున్నాయని, చట్టాల్లో నాణ్యత లేకపోవడం వల్లే అవి న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు.

తొలినాళ్లలో దేశ పార్లమెంట్ లో జరిగిన చర్చలు చూస్తే ఎంతో లోతుగా అద్భుతంగా ఉండేవని, ఇప్పుడు మాత్రం ప్రతీదీ వివాదం అవుతోందన్నారు. లోపభూయిష్టమైన చట్టాలు ప్రజలకు భారంగా మారుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. న్యాయవాదులు కూడా ప్రజాజీవితంలోకి, చట్టసభలలోకి రావాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. జస్టిస్ ఎన్వీ రమణ చెప్పినట్టు ఒకప్పటిలా చట్టసభల తీరు ఇప్పుడు లేదు. ( డిజిటల్ లోనే విద్యాబోధన )

అదే సమయంలో నాణ్యత, విలువలు తగ్గిపోవడం అనేది పార్లమెంట్ కే పరిమితం కాకుండా అన్ని వ్యవస్థలలో చోటుచేసుకుంది. అటువంటి పరిస్థితిని నిలువరించాల్సిన అవసరం అన్ని వ్యవస్థలకు ఉంది. కనీస విద్యార్హత లేని వారు, పైగా సమాజంపై అసలు ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు కూడా పార్లమెంటులో అడుగు పెడుతున్నారు. చదువుకున్న ప్రజలు కూడా పట్టింపు లేకుండా వారికి ఓట్లు వేసి గెలిపిస్తున్నారు.

అదే విధంగా న్యాయ వ్యవస్థ పైన కూడా విమర్శలు ఎక్కువగానే వస్తున్నాయి. సామర్థ్యం, ప్రతిభ ఆధారంగా కాకుండా పలుకుబడితో న్యాయమూర్తులు అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కావున ప్రతి వ్యవస్థలోనూ మరొకరు వేలెత్తి చూపలేని విధంగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. పార్లమెంటరీ వ్యవస్థ భ్రష్టు పట్టిన మాట వాస్తవమే. కానీ అదొక్కటే కాదు. అన్ని చోట్లా అదే పరిస్థితి నెలకొంది.

More Latest telugu news, Online telugu news, Political news, online news today

1 thought on “పార్లమెంట్ చట్టాల్లో నాణ్యత లోపం.. జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు..మరి మిగతా వాటి సంగతేంటి..”

Leave a Comment