సివిల్స్‌లో తెలంగాణ తేజాలు

Reddy
పెద్దిటి దాత్రిరెడ్డి
Ravi
కట్టా రవితేజ

సివిల్స్‌ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణకు చెందిన అనేకమంది యువతీ యువకులు మంచి ర్యాంకులు సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన పెద్దిటి దాత్రిరెడ్డి సివిల్స్‌లో 46వ ర్యాంకు సాధించారు. ఆమె గతంలోనే సివిల్స్‌లో ర్యాంకు సాధించి ఐపీఎస్‌ శిక్షణలో ఉన్నారు. అదేవిధంగా చౌటుప్పల్‌ మండలం తంగేడుపల్లికి చెందిన బడేటి సత్యప్రకాష్‌ 218వ ర్యాంకు సాధించారు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం బుద్ధారానికి చెందిన కట్టా రవితేజ ఆలిండియాలో 77వ ర్యాంకు సాధించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాణోత్‌ మదన్‌లాల్‌ కుమారుడు మృగేందర్‌లాల్‌ సివిల్స్‌లో 505వ ర్యాంకు సాధించాడు. ఇతడు గతంలో 551వ ర్యాంకు సాధించి ప్రస్తుతం నాసిక్‌లో ఐపీఎస్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు.

సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ కుమారుడు వినయ్‌కాంత్‌ 516వ ర్యాంకు సాధించారు. ఇతడు ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ సెక్టోరియల్‌ (ఏఈఓ)లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జగ్గయ్యపేటకు చెందిన పాలకుర్తి వెంకటేష్‌ ఐఆర్‌ఎస్‌లో 457వ ర్యాంకు సాధించారు. గతంలో ఈయనకు ఐఆర్‌ఎస్‌లో 700 ర్యాంకు వచ్చింది.

అయితే, వెంకటేష్‌ తండ్రి ఓ రోజు కూలీ కావడం గమనార్హం. ములుగు జిల్లా గిరిజన యువకుడు నరసింహస్వామి 741వ ర్యాంకు సాధించారు. ఇతడికి గతంలో ఐఎఫ్‌ఎస్‌లో 76వ ర్యాంకు రావడంతో ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. బెల్లంపల్లిలోని సింగరేణి కార్మికుడి కుమారుడు 330వ ర్యాంకు సాధించారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన వివేకానంద శుక్లాకు సివిల్స్‌లో 457వ ర్యాంకు వచ్చింది. ఇంకా అనేకమంది తెలంగాణ తేజాలు సివిల్స్‌లో మంచి ర్యాంకులు సాధించారు. వీరిలో చాలామంది కిందిస్థాయి నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.

Leave a Comment