బ్రహ్మపుత్ర నదిపై భారీ కుట్రకు తెర తీసిన చైనా..

జిత్తులమారి చైనా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. భారత్ ను దెబ్బకొట్టేందుకు అడ్డదారులు తొక్కుతోంది. తాజాగా భారీ కుట్రకు తెర తీసింది. ఓవైపు లడాఖ్ లోని త్రిశూల్ వద్ద సైనిక చర్చలు జరుగుతుండగానే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో జరగడం సృష్టించేందుకు సిద్ధమైంది.

బ్రహ్మపుత్ర నదిపై ఒక భారీ డ్యామ్ ను నిర్మించేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. దీనికి సంబంధించి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. భారత్ కు భవిష్యత్తులో సమస్యలు సృష్టించే ఉద్దేశంతోనే ఈ పనికి పూనుకుందని తెలిపింది. ఇది ఇప్పటికే చైనా నిర్మించిన అతి పెద్ద డ్యామ్ Three Gorges Dam కంటే పెద్దదిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

టిబెట్ లో జన్మించిన బ్రహ్మపుత్రానది చైనా, భారత్, బంగ్లాదేశ్ల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. 2900 కిలోమీటర్ల పొడవైన ఈ నది భారత్, బంగ్లాదేశ్ ప్రజలకు మంచినీటి అవసరాలు తీరుస్తోంది. చైనాలోని జలవిద్యుత్తులో నాలుగో వంతు విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం టిబెట్కు ఉన్నట్లుగా డ్రాగన్ కంట్రీ అంచనా వేసింది. దీంతో 2010 నుంచి ఈ నదిపై చాలా చోట్ల పలు హైడ్రో పవర్ ప్రాజెక్టులను నిర్మించాలని ప్లాన్స్ రెడీ చేస్తూ వస్తోంది. కాకపోతే అప్పట్లో రెండు పంచవర్ష ప్రణాళికలలో ఈ ప్లాన్ ముందుకు కదల్లేదు.

ఈ నది మధ్యభాగంలోని పరివాహక ప్రాంతం ఎల్ఏసికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడ కనీసం 11 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిలో అతి పెద్దదైన జాంగ్మో ప్రాజెక్టు 2015 నుంచి పనిచేస్తోంది. మిగిలిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు నదికి దిగువ భాగాన అంటే అరుణాచలప్రదేశ్ కు అత్యంత సమీపంలో ఓ భారీ ప్రాజెక్టు నిర్మించాలని డిసైడ్ అయింది.

ఒకవేళ చైనా ప్లాన్ కార్యరూపం దాల్చి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భారత ఈశాన్య ప్రాంతం నీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు వరదల దిగువ ప్రాంతాలకు ముంపు ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారీ వరదలు వచ్చినప్పుడు ఒక్కసారిగా గేట్లు తెరిస్తే దిగువ ప్రాంతాలు జలమయమయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అరుణాచలప్రదేశ్ తమదేనని భావిస్తున్న జిత్తులమారి దేశం భారీ ప్రాజెక్టులతో దిగువ ప్రదేశాలపై పట్టు సాధించాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే బంగ్లాదేశ్ కు సైతం బాధలు తప్పవు.

కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమవుతున్న చైనాపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే చైనా ప్రయత్నాన్ని పలుమార్లు తప్పుపట్టింది. ఇలాంటి భారీ నిర్మాణాలు చేపట్టినప్పుడు సరిహద్దు దేశాలకు సమాచారం ఇవ్వాలి, నదీజలాల వివరాలు పంచుకోవాలి. హైడ్రోలాజికల్ డేటా పై ఇరుదేశాలు గతంలో సమాచారం ఇచ్చి పుచ్చుకునేవి.

2017 goklam ఉద్రిక్తల తర్వాత చైనా భారత్ కు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఓవైపు బ్రహ్మపుత్రపై భారీ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తూనే మరో వైపు కూడా కుట్రకు సమాయత్తమవుతోంది చైనా. ఆ దేశంలోని సిఛువాన్ ప్రావిన్స్ నుంచి టిబెట్లోని లింజం వరకూ రైల్వే లైన్లు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్టు పనులు చురుగ్గా జరగాలని తాజాగా అధ్యక్షులు జిన్ పిన్ అధికారులను ఆదేశించారు.

47.8 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రైల్వే లైను అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు అత్యంత దగ్గర నుంచి వెళ్తుంది. చైనా వ్యూహాత్మకంగా చేపట్టిన ఈ రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే సిచువాన్ రాష్ట్రంలోని చెండు నుంచి టిబెట్ లోని లాసాకు పదమూడు గంటల్లో చేరుకోవచ్చు. గతంలో 48 గంటలు పట్టేది. ఈ రైల్వే లైను నిర్మాణం పూర్తయితే చైనా బలగాలను, ఆయుధాలను వేగంగా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. అందుకే ఈ రైల్వే ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు.

Leave a Comment