జగన్ ఆలోచనలను అంచనా వేయలేకపోతున్న టీడీపీ..

తెలుగుదేశం పార్టీని ఇప్పుడు గట్టిగా ఇబ్బంది పెడుతున్న సమస్య అధికారం లేకపోవడం కాదు, జగన్ అధికారంలో ఉండటం. తెలుగుదేశం పార్టీ తన చేతుల్లోకి వచ్చిన తర్వాత తనకు మరొకరు పోటీ లేకుండా చంద్రబాబు చేసుకుంటూ వచ్చారు.

అందుకు అవసరమైన అనేక రక్షణ కవచాలను చంద్రబాబు ఏర్పాటు చేసుకున్నారు. మీడియాతో పాటు వివిధ వ్యవస్థలలోనూ తనను సమర్ధించే సమూహాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగారు. దేశంలో ఎంత పెద్ద తప్పు చేసినా అది ఆఖరికి ఎక్కడికి చేరుతుందో అక్కడ కూడా పట్టు సాధించి తిరుగులేని నేతగా చంద్రబాబు ఎదిగారు.

ఈ రక్షణ కవచాల మధ్య దిగ్విజయంగా అధికారంలో ఉన్నా లేకున్నా రాజకీయంలో నెట్టుకొచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు అసలైన సవాలు ఎదుర్కొంటున్నారు. ఈ సవాల్ ఏ స్థాయిలో ఉంది అంటే చంద్రబాబు నీడలోనే ఎదిగిన మహావృక్షాలు కూడా ఇప్పుడు ముసుగు తీసేసి ఇప్పుడు టీడీపీ తరఫున పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ పరిస్థితికి కారణం ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని చెప్పాలి. అవసరం కావచ్చు.. అనివార్యత కావచ్చు.. ఏపీలో చంద్రబాబు, జగన్ నేరుగా తలపడక తప్పని పరిస్థితి. చంద్రబాబు విషయంలో జగన్ మేడిపండు వ్యూహాన్ని ఎంచుకున్నట్టుగా ఉంది. చంద్రబాబు ఎక్కడ ఎక్కడ బలం ఉంది.. ఏ ఏ వ్యవస్థలలో ఏ ఏ వ్యక్తులు చంద్రబాబుకు వంత పాడుతున్నారు అన్న విషయాలను ఈ ఏడాది కాలంలో జగన్ ప్రజలకు వివరించగలిగారు.

జగన్మోహన్రెడ్డిని కనీసం ఏడాది కూడా ముఖ్యమంత్రిగా ప్రశాంతంగా ఉండనివ్వకూడదన్న చంద్రబాబు అతి తొందర కూడా జగన్ పనిని చాలా సులువు చేసింది. చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పు న్యాయవ్యవస్థలో తనకున్న బలాన్ని రాంగ్ టైం లో ప్రదర్శనకు పెట్టడం.

జగన్ పాలనపై పూర్తి వ్యతిరేకత ఏర్పడింది అన్న భావన కలిగించేందుకు వందల సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు వేయించి రాజకీయ క్షేత్రాన్ని న్యాయస్థానానికి చంద్రబాబు మార్చడం తొందరపాటు చర్యే. హైకోర్టు వరుసగా ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేస్తూ అధికార యంత్రాంగాన్ని చివాట్లు పెడుతుంటే చంద్రబాబు అండ్ టీం ఆనదించిందే కానీ అవతలినుండి ఎలాంటి దాడి ఉంటుందో అంచనా వేయలేకపోయారు.

దీనికితోడు సాధారణంగా విచారణ సమయంలో కోర్టు చేసే వ్యాఖ్యలు కూడా పతాక శీర్షికలుగా ప్రచురించి నిజంగానే న్యాయవ్యవస్థలో చంద్రబాబు ఏదో అతీత బలం వుంది అన్న భావన స్వయంగా తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియా సంస్థలే ప్రజల్లో కలిగించాయి. తమకున్న వ్యవస్థలలోని బలం ద్వారా కొడుతుంటే దెబ్బదెబ్బకు జగన్ కుంగిపోతున్నారు అని ప్రత్యర్ధులు బ్రమించారే గానీ ఆ దెబ్బల తీరును జగన్ లెక్కగట్టి రికార్డు చేస్తున్నారని అంచనా వేయలేకపోయారు.

ప్రత్యర్థులు ఆనందడోలికల్లో ఉన్న సమయంలోనే జగన్ ఒక్కసారిగా దాదాపు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేశారు. అప్పటికి గానీ తమ కోసం పని చేస్తున్న వ్యక్తులు అద్దాలమేడలో నివాసముంటున్న విషయం టిడిపికి గుర్తుకు రాలేదు. కేవలం అల్లరి పట్టించాలన్న పొద్దుపోని వ్యూహాన్ని అకాలంలో అమలు చేసి ఇప్పుడు ఒక మహావృక్షానికే పెనుగాలుల ముప్పును చంద్రబాబు తెచ్చిపెట్టారు.

ఇప్పుడు వ్యవస్థలలో చంద్రబాబుకు వున్న అతిక్రమణ బంధాల గురించి అంతా బహిరంగం అయిపోయింది. చంద్రబాబు కంటే ఆ వ్యవస్థలోని వ్యక్తులకు, చివరకు ఆ వ్యవస్థలకు తలవంపులు తెచ్చిపెట్టింది. ఇందులో జగన్ మరీ ఆయాస పడి పన్నిన వ్యూహమంటూ ఏమీ లేదు. టైమింగ్ చూసి ఒక లేక తో గట్టిగా కొట్టడమే జగన్ చేశారు.

విశాఖలో విజయమ్మ గెలిస్తే రాయలసీమ రౌడీలు వస్తారంటూ గతంలో చంద్రబాబు బృందం విజయవంతంగా ప్రచారం చేయగలిగింది. కానీ బాలకృష్ణ అల్లుడు గీతం వర్సిటీ నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని విడిపించడం ద్వారా అసలైన కబ్జాలు ఎవరు చేశారో అదే విశాఖ గడ్డ మీద నుంచి జగన్ ప్రాక్టికల్ గా నిరూపించగలిగారు.

ఇంగ్లీష్ మీడియం అంశం ద్వారా తెలుగుదేశం పార్టీ పేదల పక్షమో, పెద్దపక్షమో స్పష్టంగా నిరూపించగలిగారు. టిడిపి అమరావతికే అంకితం కావడంతో మూడు రాజధానుల విషయంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్ల టీడీపీ చిత్తశుద్ధి ఏ పాటిదో జగన్ ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఎన్నికల కమిషనర్ ని పట్టుకొని చంద్రబాబు మనిషి అంటారా అని నోరెళ్ళబెట్టిన వ్యక్తులకు కూడా, ఆ తర్వాత నిమ్మగడ్డ వ్యవహార శైలి గురించి, స్టార్ హోటల్స్ లో చంద్రబాబు సన్నిహితులతో ఆయన చేసిన భేటీల గురించి, కోట్లు పెట్టి సుప్రీంకోర్టులో కొట్లాట అంశాలన్నీ ప్రజలకు అర్థమయ్యేలా జగన్ చేయగలిగారు.

ఏదో శక్తి వెనక లేకుంటే కోట్ల రూపాయలు పెట్టి సుప్రీం కోర్టులో లాయర్లని నిమ్మగడ్డ ఎలా నియమించుకుంటారు అన్న అభిప్రాయం ప్రజల్లో గట్టిపడిపోయింది. దశాబ్దాలుగా పెద్దమనుషులుగా చలామణి అయిన అనేక మంది టీడీపీ పెద్దల సంగతులు కూడా జగన్ హయాంలోనే సామాన్యులకు స్పష్టంగా అర్థమైన ఉదంతాలు ఉన్నాయి.

వ్యవస్థలలో ముసుగులు వేసుకొని కూర్చున్న వారు కూడా ఇప్పుడు ఇష్టానికి వ్యవహరించాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితితో పాటు శీల పరీక్షకు నిలబడవలసి వస్తుందని భీతి చెందే పరిస్థితిని జగన్ తేగలిగారు.

Leave a Comment