18 సం.లు నిండిన వారికి వాక్సిన్.. అందుకేనా.. !

కష్టకాలం రాగానే పొద్దున్నే లేచి ప్రభుత్వాలను తిట్టడం ప్రజలకు అనవాయితీ. అదే ప్రభుత్వాలు ప్రజల క్రమశిక్షణా రాహిత్యం చూపించి నిస్సత్తువగా పని చేయడం పరిపాటి. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను పట్టించుకునే వారు కరువవుతున్నారు.

ఎవరూ ఊహించని విధంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నేటి ప్రజల ఆలోచనలు ఎలా వున్నాయి అంటే .. పనులు సాగాలి కానీ పరిస్థితులు మాత్రం దిగజారకూడదు. కర్ఫ్యూ విధించాలి కాని ఆర్థిక వ్యవస్థ మాత్రం అతలాకుతలం కాకూడదు. ఇలా అనుకుంటే ఎలా. ప్రజలు, పాలకులు కలిసి సమిష్టిగా పోరాడాల్సిన సమయమిది.

ఇదంతా ఎందుకు అంటే ఒక వైపు కరోనా తీవ్రత పెరుగుతుంటే.. అది మనల్ని ఏమీ చేయదు అన్నట్లుగా మాస్కులు ధరించడం మానేస్తున్న జనం.. సామాజిక దూరం పాటించడం కూడా మానేసారు. ఎన్నికల సందర్భంగా పార్టీలు భహిరంగ సభలు పెడితే ప్రజలు పరుగులు పెడుతున్నారు. పాలకులదేముంది.. తగు జాగ్రత్తలతో వస్తారు.. పోతారు. మధ్యలో నలిగేది సాధారణ ప్రజలే కదా. ఆ అవగాహన ఉండాల్సింది మనకే కదా.

ఇక ప్రభుత్వాలు తమకు అవసరం అనుకున్నప్పుడు రూల్స్ ని ఎలాగైనా మార్చేసుకుని కోవిందడ్ నిబంధనలను పక్కన పెట్టేస్తాయి. అవసరం లేదనుకుంటే ముంచుకొస్తుంది ప్రమాదమే అయినా పట్టించుకోవు. ఈ విషయాల్ని గమనిస్తే ప్రభుత్వాలు ఎంత చక్కగా పనిచేస్తున్నాయో తెలుస్తుంది.

ఎంతగా వృధా అయిందంటే

ఓవైపు పలు రాష్ట్రాల్లో టీకాల కొరత ఎదురవుతున్న వేళ వాక్సిన్ల వృధా ఎక్కువ స్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ 11 వరకు రాష్ట్రాలకు ఇచ్చిన మొత్తం వాక్సిన్లలో 23 శాతం డోసులు వృధా అయినట్లుయిగా RTI దరఖాస్తు ద్వారా వెల్లడయింది. ఇందులో అత్యధికంగా తమిళనాడులో ఈ వృధా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

ఏప్రిల్ 11 నాటికి రాష్ట్రాలన్నిటికీ పది కోట్ల డోసులు కేటాయించగా ఇందులో 44 లక్షలకు పైగా డోసులు వృధా అయినట్లు వెల్లడైంది. తమిళనాడులో 12.10 శాతం, హరియాణాలో 9.74 శాతం, పంజాబ్లో 8.12 శాతం, తెలంగాణలో 7.55 శాతం డోసులు నిరుపయోగం అయినట్లుగా RTI దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో సంబంధిత అధికారులు పేర్కొన్నారు. మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఈ వృధా తీవ్రత తక్కువగా ఉన్నట్లు తెలిపారు.

దేశంలో టీకా వృధాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం దోషుల వృధా కట్టడికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. స్టాకును సకాలంలో ఉంచుకోవాలని, టీకా వినియోగానికి సంబంధించిన Co-WIN పోర్టల్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించింది.

ఇలా కేంద్రం ఎంత హెచ్చరిస్తున్నా ఇటు ప్రజలు, అటు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్నది నిజం. ఇది చాలా కఠిన సమయం. రానున్న మూడు వారాలు అత్యంత కీలకం. ఈలోగా ఐక్యతతో ఈ పాండమిక్ పై పోరాటం చేసి గెలవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అలాగే వాక్సిన్ విషయంలో ఎటువంటి అపోహలు లేకుండా వేయించుకోవడం తమ విధిగా భావించాలి.

ఇప్పుడు 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి గల కారణం వాక్సిన్ల వృధా కానివ్వకూడదనే. ఇకనైనా ప్రజలు, ప్రభుత్వాలు దీనిని సద్వినియోగం చేసుకోవాలి.

Leave a Comment