ఏపీలో బీజేపీ టార్గెట్ టీడీపీనే.. ఎందుకు.!!

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి శతవిధాలా కృషి చేస్తోంది. ఢిల్లీ హైకమాండ్ కూడా దీనిపై ఓ కన్నేశారు. దీనికి అనుగుణంగా పావులు కూడా కదుపుతున్నారు. కానీ, ఇక్కడ వారి పరిస్థితి విచిత్రంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా అధికారంలోకి రావాలంటే అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్‌ చేస్తారు. కానీ, ఇక్కడ ఏపీలో బీజేపీ మాత్రం అధికార పార్టీ అయిన వైసీపీని వదిలి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీపైనే దృష్టంతా నిలిపింది.

ప్రతి విషయంలోనూ వైసీపీ కంటే టీడీపీనే ఎక్కువగా విమర్శిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. టీడీపీ కాలంలో అంటూ మొదలు పెడుతూ విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. టీవీ చానళ్లలో జరుగుతున్న చర్చల్లో కూడా ప్రభుత్వ విధానాలపై చర్చించే సమయంలోనూ బీజేపీ నేతలు టీడీపీనే టార్గెట్‌ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారన్న విషయం చాలామంది బీజేపీ నేతలకు కూడా అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు. ( సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ.. )

అయితే, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినా, 151అసెంబ్లీ సీట్లు సాధించినా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కూడా గణనీయమైన ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఏపీలో అధికార పక్షం తర్వాత ఓట్లశాతం ఎక్కువగా ఉన్న పార్టీ టీడీపీనే. ఓట్లశాతంలో చూసుకుంటే బీజేపీ అట్టడుగు స్థాయిలో ఉంది. వాస్తవానికి అధికార పక్షాన్ని ఢీకొట్టే పరిస్థితి అక్కడ బీజేపీకి లేదు. అందుకే మొదటిస్థానంలో ఉన్న బీజేపీని ఢీకొడితే తమ లక్ష్యం నెరవేరదని భావించి రెండో స్థానంలో ఉన్న టీడీపీని టార్గెట్‌ చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

టీడీపీని బలహీనపరిస్తే వారంతా ఎలాగూ వైసీపీ వైపు వెళ్లరని, మిగతా పార్టీలేవీ ఇక్కడ బలంగా లేనందున ఆ ఓటింగ్‌ అంతా బీజేపీకి లాభిస్తుంది. పైగా అధికార పార్టీపై వ్యతిరేకత కూడా తమకు కలిసి వస్తుందన్న భావనలో బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రెండోస్థానంలో ఉన్న టీడీపీ ఓట్లతో తాము రెండో స్థానానికి చేరుకుంటామని, సహజంగా ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక ఓటు కూడా తమకే కలిసి వస్తుందని, దీంతో తాము మొదటి స్థానానికి చేరి ఏపీలో పదవిలోకి వస్తామన్న భావనతోనే బీజేపీ నేతలు తమ దృష్టినంతా టీడీపీపై పెట్టారన్న చర్చ జోరుగా సాగుతోంది. మరి బీజేపీ నేతల వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి.

Leave a Comment