బీజేపీకి అన్నీ కలిసొస్తున్నాయా..!!

అధికారం కోసం బీజేపీ అద్దిరిపోయే ఎత్తులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రాల్లో బలపడకుండా కేంద్రంలో అధికారం నిలుపుకోవడం అసాధ్యమని భావించిన కమలనాథులు రాష్ట్రాలపై కన్నేశారు. అక్కడ వేళ్లూనుకొని ఉన్న ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకునే పనిలో కమలనాథులు బిజీగా ఉన్నారు.

ఏ లాభం లేకుండా శెట్టిగారు వరద జోలికి పోరు అన్నది పాతకాలం నాటి సామెత. ఈ సామెత సరిగ్గా ఇప్పటి రాజకీయ పార్టీలకు సరిపోతుంది. ఎవరికి వారు తాము బలపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఎవరు ఎన్ని పాచికలు వేసినా చివరకు అది అధికారం కోసమే అన్న సంగతి అందరికీ తెలిసిందే.

బిజెపి వ్యూహం అదేనా ..

అయితే, బీజేపీ వ్యూహం మాత్రం అద్దిరిపోయేలా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాస్తవానికి గతంలో జాతీయ పార్టీల హవా కొనసాగేది. రానురాను అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పుట్టుకు రావడంతో జాతీయ పార్టీల మనుగడకు ప్రమాదం ఏర్పడింది. చివరికి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాల మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఎదురైంది.

వాస్తవానికి ప్రాంతీయ పార్టీల పుట్టుకకు ప్రధానమైనవి కులం, స్థానిక అంశాలు. వీటివల్లనే రాష్ట్రాల్లో జాతీయ పార్టీల మనుగడకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణాలు తెలుసుకున్న బీజేపీ ముందుగా మేలుకొంది. ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలన్నట్టు జాతీయ పార్టీల మనుగడను దెబ్బతీసిన ప్రాంతీయ పార్టీలను కూడా దెబ్బతీయాలన్న వ్యూహాన్ని కమలనాథులు పక్కాగా అమలు చేస్తున్నారు.

వాస్తవానికి బీజేపీ పక్కా హిందూత్వ పార్టీగా ముద్ర వేసుకొంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ సెక్యులర్‌ పార్టీ. ఇది బీజేపీకి బాగా కలిసి వచ్చింది. అందుకే హిందూ మతాన్ని ముందుకు తీసుకువచ్చి దానిద్వారా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేలా మోదీ, అమిత్‌షాలు పథకాన్ని రచించారు. ఈ పథకం అమలుతోనే ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, త్రిపుర రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

ఇప్పుడు అదే వ్యూహాన్ని కర్ణాటక, కేరళ, బెంగాల్‌లో అమలు చేసి అధికారాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఏపీలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఇక్కడ వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం. తెలుగుదేశానికి కమ్మ సామాజికవర్గం అండగా నిలుస్తున్నాయి. పైగా జగన్‌ క్రిస్టియన్‌ కాబట్టి ఆ వర్గాలు కూడా వైసీపీకి అండగా నిలుస్తున్నాయి. దీంతో బీజేపీ కాపువర్గంపై కన్నేసింది.

అందులో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజును నియమించింది. ఆయన బీజేపీ పగ్గాలు చేపట్టగానే వారి సామాజిక వర్గానికి చెందిన మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు చిరంజీవి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, కాపునేత ముద్రగడ పద్మనాభాన్ని కలిసి వారి మద్దతును అడిగారు. ముద్రగడను పార్టీలోకి రమ్మని.. పార్టీలో ఉన్నత స్థాయిలో ఉంచుతామని కూడా హామీ ఇచ్చారు. కానీ, అయన దీనికి సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే, కేవలం కాపువర్గం ద్వారా అధికారం పొందడం అసాధ్యం అని తెలుసుకున్న బీజేపీ తాజాగా హిందూత్వంపై కన్నేసింది. హిందూమతం పేర పార్టీని బలోపేతం చేసేందుకు పాచికలు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఇటీవల ఏపీలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు కూడా కమలం పార్టీకి కలిసి వస్తున్నాయి. ఆ దాడులకు కారణం ఎవరైనా దానిని అజెండాగా తీసుకొని వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పనులను సోము వీర్రాజు బాగానే చేస్తున్నారు. ఇంత పకడ్బందీగా ముందుకు వెళ్తున్న బీజేపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.

Leave a Comment