తెలంగాణాలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈటెల రాజేందర్ వ్యవహారం రాజకీయ రగడకు తెరతీసింది. ఎంఎల్ఏ పదవికీ.. టిఆర్ఎస్ పార్టీకీ ఈటెల రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఈటెల నియోజకవర్గమైన హుజురాబాద్ లో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉపఎన్నికలో ఎవరిని బరిలోకి దించాలా అనేది అన్ని పార్టీలకు సవాలుగా మారింది. ఎందుకంటే హుజురాబాద్ ఈటెలకు పెట్టని కోట లాంటిది. ఈటెలను ఎదుర్కోవాలంటే ఇతర నియోజకవర్గం నుండి నాయకులననో.. లేక పక్క పార్టీలోని నాయకులను తెచుకోవడమో చేయాలి. గులాబీ బాస్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. బీజేపీలో పక్క చూపులు చూస్తున్న నేతలకు కెసిఆర్ గాలం వేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇందులో భాగంగా బీజేపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డికి గాలం వేసినట్టు సమాచారం. ఆయన బీజేపీ పార్టీని వదిలేసినట్లేనని ఆ పార్టీనేతలే అంటున్నారు. ఆయన త్వరలోనే గులాబీ గూటీకి చేరడానికి సన్నద్ధం అవుతున్నట్టు వినికిడి. కొత్తగా బీజేపీలో చేరిన వారు ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారని చర్చ సాగుతోంది. కొందరు జాతీయ పార్టీ అన్న భావనతో సర్దుకుపోతుంటే .. మరికొందరు వేరే మార్గాలు వెతుక్కుంటున్నారు. ఆ విధంగా పెద్దిరెడ్డి పేరు బయటకు వచ్చింది. ( ఈటెల రాజేందర్ ఎపిసోడ్ )
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపిలోకి వస్తున్నారనే ప్రచారం మొదలైనప్పటినుండే పెద్ద రెడ్డిలో అసంతృప్తి మొదలైంది. బీజేపీలో చేరిక గురించి తనకు మాట మాత్రంగానైనా చెప్పలేదని ఆయన ఫైర్ అయినట్టు సమాచారం. అప్పటినుంచే బీజేపీతో అంటీ ముట్టనట్లు వుంటున్నారు. హుజురాబాద్ నియోజకవర్గానికే చెందిన ఈటెల రాజేందర్, పెద్దిరెడ్డి ల మధ్య మొదటి నుండీ అంత సఖ్యత కూడా లేదు. పైగా ఈటెలపై కామెంట్స్ చేశారు. ఇది స్థానికంగా బీజేపీకి కొంత ఇబ్బందిగా వున్నా పార్టీ నేతలు మాత్రం పైకి మాట్లాడటం లేదు.
బుజ్జగిస్తున్న బీజేపీ పెద్దలు
హుజురాబాద్ ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పెద్దిరెడ్డి ఎపిసోడ్ వారికి మింగుడు పడటం లేదని తెలుస్తోంది. పెద్దిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆయనతో మాట్లాడినట్లు సమాచారం. మరికొందరు బీజేపీ ముఖ్యనేతలు కూడా ఆయన్ను కలిసినాట్లు .. కలిసి పని చేద్దామని చెప్పినట్లు టాక్. పెద్దిరెడ్డి తండ్రి ఇటీవల కన్నుమూసారు. పరామర్శకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, బీజేపీ పెద్దలు ఆయన ఇంటికి వెళ్లారు. అల్లాగే టిఆర్ఎస్ నాయకుల కొందరు వెళ్లి పరామర్శించారని, ఆ సందర్భంగా పార్టీ మార్పు పై చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి.
గులాబీ నేతల ప్రతిపాదనలను ఆయన సానుకూలంగా స్పందించారని.. గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈటెల కూడా పెద్ది రెడ్డిని కలిసి పరామర్శించారు. ఆ క్రమంలో అతను బిజెపిలో చేరిన పరిస్థితులు వివరించి తమకు సహకరించాలని కోరినట్లు వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. మరి పెద్దిరెడ్డి గులాబీ గూటికి చేరతారా.. లేక బీజేపీకి సహకరిస్తారా అన్నది చూడాలి.