బీజేపీ సరికొత్త వ్యూహం.. బెంగాల్ విభజన రాగం..!

బెంగాల్ విభజన : ఏడాది మే లో జరిగిన బెంగాల్ ఎన్నికల్లో మమతను ఓడించాలని కమలదళం ఎన్నో ప్రయత్నాలు చేసింది. తృణమూల్ కీలక నేతలకు కాషాయ కండువా కప్పినా ఆ పార్టీ అఖండ విజయం సాధించి మమత మూడో సారి సీఎం పీఠం అధిరోహించారు. ఇక ఎన్నికలు ముగిసినా కూడా బెంగాల్ రాజకీయ వేడి చల్లారలేదు. ఈ నేపథ్యంలో బెంగాల్ బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారతీయ జనతా పార్టీ బెంగాల్ విభజనకు మద్దతుగా స్వరం మార్చుకుంటుందని బెంగాల్ చీఫ్ మాటలను బట్టి తెలుస్తోంది.

ఇప్పటివరకు డార్జిలింగ్ ప్రాంతాన్ని కలిపి గూర్ఖాలాండ్ గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉండేది. అయితే ఆ ఉద్యమాన్ని మమతాబెనర్జీ ( mamata banerjee) కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు ప్రకటించి సరికొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. దీంతో బెంగాల్ రాజకీయ పార్టీల ఎజెండాయే మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ( ఆఫ్ఘనిస్తాన్ తెరపైకి అమ్రుల్లా సలేహ్ )

ఓటమి తరువాత మొదలైన బెంగాల్ విభజన రాగం

రెండు రోజుల క్రితం బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ బెంగాల్ విభజనకు మద్దతుగా మాట్లాడారు. “బెంగాల్ నుంచి ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ లు విడిపోవాలి అనుకుంటే అందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నే కారణం. ఉత్తర బెంగాల్లో అభివృద్ధి లేదు. ఉద్యోగాలు, విద్య, వైద్యం కోసం అక్కడి ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారు. సరైన స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, పరిశ్రమలు ఆదాయం ఇచ్చే అవకాశాలు ఎందుకు కల్పించలేదు. ఇదే పరిస్థితి జంగల్ మహల్ లో కూడా ఉంది” అని వ్యాఖ్యానించారు.

నిజానికి దిలీప్ ఘోష్ అభిప్రాయం బెంగాల్ ఒక్కటిగా ఉండాలనే. అయితే అది మూడు నెలల కిందటి వరకు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే.. బీజేపీకి చెందిన అలీపూర్ దార్స్ ఎంపీ రాష్ట్రాన్ని విభజించాలని డిమాండ్ చేశారు. కానీ ఘోష్ అది ఎంపీ వ్యక్తిగత అభిప్రాయంగా ప్రకటించారు. బెంగాల్ ఒక్కటిగా ఉండేందుకు బీజేపీ కట్టుబడి ఉందని ప్రకటించారు. తృణమూల్ నుండి బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సువెందు అధికారి.. దీదీని ఎదుర్కోవాలంటే ప్రాంత రాజకీయలే బెటర్ అని అనుకున్నారేమో.. ఇటీవల ఆయన బెంగాల్ విభజన ప్రకటన చేస్తున్నారు. నైరుతి ప్రజలంతా రాష్ట్రం విడిపోయేందుకు మద్దతుగా ఉన్నారని అన్నారు. దానికి తగ్గట్లుగా దిలీప్ ఘోష్ కూడా స్వరం పెంచారు.

బీజేపీ ఆ రెండు ప్రాంతాలను రాష్ట్రాలుగా చేయాలని బెంగాల్ విభజన వాదాన్ని లేవనెత్తడానికి కారణం ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉంది. ఉత్తర బెంగాల్ 8 జిల్లాల సముదాయం. హిమాలయాల వరకూ ఉంటుంది. నైరుతి ప్రాంతం ఐదు జిల్లాలతో ఒడిశా, జార్ఖండ్ సరిహద్దులుగా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 109 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. మిత్ర పక్షాలతో కలిసి బిజెపి వీటిలో 53 స్థానాలు గెలుచుకుంది. ఇతర 183 స్థానాలకు గాను కేవలం 24 స్థానాలను మాత్రమే బీజేపీ గెలిచింది.

అందుకే తమకు మద్దతు ఉన్న ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేసినట్లు భావిస్తున్నారు. మమతా బెనర్జీని ఓడించడం కష్టం అనుకునే బీజేపీ నేతలు విభజన రాజకీయాలు చేస్తున్నారని తృణమూల్ నేతలు విమర్శలు ప్రారంభించారు. బీజేపీ తీరుపై నిరసన కూడా టీఎంసీ క్యాడర్ ప్రారంభించింది. ఠాగూర్ స్థాపించిన విశ్వ భారతీ యూనివర్సిటీ క్యాంపస్ లో ర్యాలీ కూడా నిర్వహించారు. విభజన వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. కమ్యూనిస్టులు కూడా విభజన ప్రతిపాదనను ఖండిస్తున్నారు.

More Latest telugu news todayOnline telugu news todayPolitical newsonline news today