బాబుగారు ఏంచేసినా లాజిక్కే మరి ..

సీఎం పీఠం చేజారిందన్న ఆవేదనో, కేసులు మెడకు చుట్టుకుంటాయి అన్న ఆందోళనో, నేతల వరుస జంపింగ్ లతో పరిస్థితులు చేజారుతుందన్న ఆక్రోశమో తెలియదుగానీ.. చంద్రబాబు ఈ మధ్యన చాలా విషయాలలో లాజిక్ మిస్ అవుతున్నారు అని అనిపిస్తుంది.

జగన్ ను అర్జెంటుగా ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసి.. మళ్లీ చక్రం తిప్పాలన్న తపనలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. కొద్ది రోజులుగా తరచూ ఆయన నోటి నుంచి వినిపిస్తున్న జమిలి ఎన్నికల జపం కూడా అందులో భాగంగానే అనిపిస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచన మోడీ మనసులో ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో దానిని అమలు చేస్తూ ధైర్యం చేయడం ఆయనకు దుస్సాహసమే అవుతుంది.

కరోనా కారణంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యాయి. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవడంతో మోదీ గ్రాఫ్ ఇటీవల గణనీయంగా తగ్గింది. కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడానికి మరో రెండేళ్లు పడుతుందని ఆర్ధిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు వెళ్లడానికి బిజెపికి బలమైన పాజిటివ్ ఫ్యాక్టర్ ఏది ప్రభుత్వానికి లేదు.

అణుపరీక్షలు, కార్గిల్ యుద్ధం కావచ్చు.. కాంగ్రెస్ హయాంలో మితిమీరిన అవినీతి అవ్వచ్చు.. వాజ్పేయి హయాం నుంచి గత ఏడాది జరిగిన ఎన్నికల వరకు ఏదో ఒక బలమైన అంశాన్ని ఆసరాగా చేసుకుని బిజెపి ఎన్నికలలో విజయం సాధిస్తూ వస్తున్నారు అన్నది కాదనలేని సత్యం. అయితే ఇప్పుడు అలా చెప్పుకోవడానికి ఇటీవలికాలంలో NDA సర్కార్ సాధించిన ఘనత ఏదీ లేదు. పైగా వ్యవసాయ బిల్లు, ఇతర కారణాలతో NDA లోని కీలక భాగస్వాములు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. పార్లమెంటులో మెజారిటీ ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా NDA మనుగడ సాగుతోంది గాని.. వాజ్పేయి సర్కారు మాదిరిగా బొటాబొటి మెజారిటీతో ఉంటే కేంద్రంలో పరిస్థితులు వేరుగా ఉండేవి.

బిజెపి ఆ సాహసం చేస్తుందా

భాగస్వామ్య మిత్రులతో తలెత్తుతున్న ఇబ్బందులను తట్టుకోవడానికి తలక్రిందులు అవుతున్న తరుణంలో బిజెపి సర్కార్ జమిలి ఎన్నికలకు వెళ్లే దుస్సహసానికి మోడీ సిద్ధమవుతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇలాంటి తరుణంలో చంద్రబాబు మాత్రం నిత్యం జమిలి మంత్రాన్ని జపిస్తున్నారు. ఎన్నికల తర్వాత చేష్టలుడిగి, డీలా పడిన పార్టీ నేతల చెవుల్లో ఈ మంత్రాన్ని నూరిపోస్తూ.. ఇదిగో ఎన్నికలు వచ్చేస్తున్నాయి.. ఇక విజయం మనదే అంటూ పదే పదే ఊదరగొడుతున్నారు. కేడర్లో నిరాశానిస్పృహలు పారద్రోలడానికి చంద్రబాబు ఈ మాటలు చెబుతున్నా.. జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందా.. ఒకవేళ ఈ ఎన్నికలు జరిగితే టీడీపీ అధికారంలోకి వచ్చే సీన్ ఉందా.. అన్నది చూడాలి.

వాస్తవానికి జమిలి ఎన్నికలు పెట్టాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలను ఆపాల్సి ఉంటుంది. బీహార్ తర్వాత తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ ఎన్నికలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఆపేసి ఒకేసారి జరిగేలా చూడాల్సి ఉంటుంది. అసలు రాజ్యాంగ సవరణ అనే పెద్ద టాస్క్. ఇప్పుడు మొదలు పెడితే మరో ఐదేళ్లకు గాని ఈ తతంగం పూర్తికాదు. ఈ లోపు బీహార్, కేరళ ఎన్నికలు పొడిగించాలి. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల గడువు తగ్గించాలి. ఐదేళ్ల గడువును కుదించితే ఆయా రాష్ట్రాలు కేసులు వేసే అవకాశం ఉంది. వీటన్నింటినీ మించి ఉభయ సభల్లో తీర్మానం చేయాలి. ఈ తీర్మానం చేయాలంటే 2/3వ వంతు మెజార్టీ ఉండాలి.

మద్దతు ఇచ్చేవారెవరు

లోక్ సభలో అయితే ఆ మెజారిటీ ఉంటుందిగానీ, రాజ్యసభలో బీజేపీకి అంత మెజారిటీ లేదు. అకాలీదళ్ ,శివసేన NDA నుంచి ఇప్పటికే బయటికి వెళ్ళాయి. రాజ్య సభలో తీర్మానం చేయాలంటే వైసీపీ, టీఆర్ఎస్ మద్దతు తప్పనిసరి. మోదీ పై కారాలు మిరియాలు నూరుతున్న కేసీఆర్ కేంద్రానికి మద్దతిచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇతర అంశాల్లో జగన్ మద్దతు ఇస్తున్నప్పటికీ.. తన పదవీ కాలాన్ని రెండు సంవత్సరాలు తగ్గించుకుని జమిలి ఎన్నికలకు జగన్ మద్దతు ఇవ్వడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరు.

జమిలి జపం వెనుక కారణాలేంటి

ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలియనివి కాదు. ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన ఆయన ఈ అంశాలను విస్మరించారు అనుకోడానికి లేదు. అయినప్పటికీ చంద్రబాబు పదేపదే జమిలి ఎన్నికలు ఎందుకు ప్రస్తావిస్తున్నారు. అన్నీ తెలిసిన ఆయన జమిలి ఎన్నికల విషయాల్లో లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు. వీటికి సమాధానం కావాలంటే టిడిపి ప్రస్తుత పరిస్థితిని పరిగణలోనికి తీసుకోవాలి. సార్వత్రిక ఎన్నికలు జరిగి ఇప్పటికి ఏడాదిన్నర మాత్రమే గడిచింది. మరో మూడేళ్లకు కానీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఇప్పటికే నిరాశా నిస్పృహలతో ఉన్న నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. వారి వెంట కేడర్ కూడా వెళ్ళిపోతుంది. ఇదే పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. త్వరలో ఎన్నికలు వస్తాయి అని చెప్పి కేడర్లో ఆ మూడ్ క్రియేట్ చేస్తే జంపింగ్ లు ఆగుతాయి అన్నది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది.

వాస్తవానికి ఒకవేళ మోడీ జమిలి ఎన్నికలకు సిద్ధమైనా ఇక్కడ టిడిపి దానికి సిద్ధంగా ఉందా అన్నది సందేహమే. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది అభ్యర్థులు నియోజకవర్గాల మొహం చూడలేదు. ఎవరిదాకో ఎందుకు.. మంగళగిరిలో ఓటమి పాలైన లోకేష్ మళ్లీ అక్కడ అడుగుపెట్టింది లేదు. తనకు వరుస విజయాలు కట్టబెడుతున్న కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించింది లేరు. ఎన్నికల్లో విజయం సాధించిన 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురు ఇప్పటికే గోడదూకేశారు. మరో ఇద్దరు ముగ్గురు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. నలుగురైదుగురు మినహా మిగిలిన వారు కూడా నియోజకవర్గాల్లో అంత యాక్టివ్ గా లేరు. దాదాపు మూడోవంతు నియోజకవర్గాల్లో పార్టీ కి సరైన ఇంచార్జిలు లేరు.

అంతేకాకుండా కరోనా వ్యాధి ప్రారంభంలో హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు, లోకేష్ ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడడం లేదు. కరోనా అంతమయ్యేవరకు లేదా వాక్సిన్ వచ్చేవరకు వారిద్దరూ ప్రజలలోకి వెళ్లే అవకాశాలు కూడా కనిపించడం లేదు. వచ్చే ఏడాది మార్చిలోపు కరోనాకు పూర్తిస్థాయి వాక్సిన్ వచ్చే ఛాన్స్ లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంటే చంద్రబాబు, లోకేష్ ప్రజలలోకి రావాలంటే మరో ఐదారు నెలలు ఆగాల్సిందే. జమిలి ఎన్నికలంటూ జరిగితే 2022 వ సంవత్సరం మధ్య లోనే ఉంటాయి. దీనిని బట్టి చంద్రబాబు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన ఏడాదికే ఎన్నికలను ఎదుర్కోవడం సాధ్యమయ్యే పనేనా.

ఇప్పటికే చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా తయారైన కేడర్ను తిరిగి సమకూర్చుకోవడం జరిగే పనేనా. చంద్రబాబుకి ఇవేమీ తెలియని విషయాలు కాదు.. అయినప్పటికీ ఆయన జమిలి మంత్రం వదలకుండా చెబుతున్నారంటే దానికి కారణం ఒక్కటే.. గోడ దూకుళ్లను కొంతవరకు నిరోధించడం, నిస్తేజంలో కూరుకుపోయిన పార్టీ శ్రేణుల్లో కదలిక తీసుకు రావడం. పక్క రాష్ట్రంలో కూర్చుని తండ్రికొడుకుల మాటలతో కేడర్లో ఉత్సాహం ఉరకలు ఎక్కుతుందా.. ప్రత్యర్థి పార్టీలోకి జోరుగా సాగుతున్న వలసలను ఈ మంత్రం అడ్డుకుంటుందా చూడాలి. .

Leave a Comment