అపెక్స్ కౌన్సిల్ లో వాదనలకు సిద్ధమైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..

ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ లో నీటి వివాదాలపై తమ వాదనను గట్టిగా వినిపించేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధమవుతున్నారు. కేంద్ర జలశక్తి శాఖా మంత్రి చైర్మన్ గా ఉండే అపెక్స్ కౌన్సిల్ లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు.

అపెక్స్ కౌన్సిల్ లో ఏపీ విధానాలు పూర్తిగా ఎండగడతామని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ వైఖరితో పాటు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి కెసిఆర్ ఒక లేఖ కూడా రాశారు.

అటు అపెక్స్ కౌన్సిల్ భేటీ నేపథ్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అజెండా వారీగా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ వాదనను తిప్పికొట్టేందుకు కొన్ని అంశాలతో ప్రజెంటేషన్ అధికారులు సిద్ధం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ఆయకట్టు కోసం చేపడుతుంది కాదని.. ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర కమిటీకి కూడా స్పష్టం చేసిన అంశాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తోంది.

ఏపీ వాదన

అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు కూడా అవసరం లేదని గ్రీన్ ట్రిబ్యునల్ కు కేంద్ర ప్రభుత్వం నివేదించిన అంశాన్ని కూడా కౌన్సిల్ లో ఏపీ ప్రభుత్వం లేవనెత్తబోతోంది. ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని.. అంతకుమించి ఒక్క చుక్క నీరు కూడా అదనంగా వాడుకోమని ఏపీ ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. తమ వాటాను వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే అడ్డుకోవడంలో అర్థం లేదు అన్నది ఏపీ వాదన.

శ్రీశైలం ప్రాజెక్ట్ లో 800 ల అడుగులకు నీటిమట్టం పడిపోయినా.. తెలంగాణ రాష్ట్రం నీటిని తోడుకునేందుకు వీలుగా అనేక ప్రాజెక్టులు చేపట్టిన అంశాన్ని ఏపీ ప్రభుత్వం లేవనెత్తుతోంది. శ్రీశైలంలో 881 అడుగుల మేర నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకెళ్ళడం సాధ్యమవుతోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల తమకు కూడా తెలంగాణ తరహాలో శ్రీశైలంలో తక్కువ నీటిమట్టం ఉన్నా తమ వాటా నీటిని తీసుకునేందుకు అవకాశం ఉండాలని.. అందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని ఏపీ ప్రభుత్వం వాదించబోతోంది.

సీజన్ ఆరంభంలో నాగార్జునసాగర్ లో సరిపడా నీరు ఉన్నా విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఎడమగట్టు విద్యుత్కేంద్రం నుంచి రోజుకు 4 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం దిగువకు వదిలేసిన అంశాన్ని కూడా ఏపీ వాదిస్తోంది. దీనివల్ల నీటిమట్టం పడిపోయి రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు నీరు అందకుండా అవుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 800 అడుగులు ఉన్నాసరే.. డిండి, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి , ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా రోజుకు 6.95 టిఎంసిల నీటిని తరలించే అవకాశం తెలంగాణ రాష్ట్రానికి ఉందని గుర్తు చేస్తోంది. అదే 800 ల అడుగులకు నీటిమట్టం పడిపొతే ఏపీకి కేవలం హంద్రీనీవా ద్వారా రోజుకు 0.33 టిఎంసిల నీటిని తరలించే అవకాశం మాత్రమే ఉందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

తెలంగాణ రాష్ట్రం 800 అడుగుల నుంచి కావాల్సిన నీరు తీసుకుంటూ నీటిమట్టాన్ని పడగొడుతోందని.. 820 అడుగుల నుంచి నీటిని తీసుకోవడం ఎలా సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ అసమానతను దూరం చేసేందుకే 800ల అడుగుల నుంచి తమ వాటా నీటిని కూడా తీసుకునేందుకు వీలుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ లో చెప్పబోతోంది.

తమకు కేటాయించిన నీరు కాకుండా అదనంగా ఒక్క చుక్క నీరు కూడా అవసరం లేదని.. కావాలంటే మీటర్లు ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అటు తాజాగా కేసీఆర్ కేంద్ర జల శక్తి శాఖ మంత్రికి రాసిన లేఖలో పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను తమ రాష్ట్రానికే అప్పగించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ఏం చేస్తోందని తన లేఖలో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Comment